నవరత్నాలతో ప్రజలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నవవిధాలుగా మోసం చేశారని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... హామీలన్నీ నీటి మీద రాతలుగా మార్చిన ఏకైక సీఎం జగనే అని చెప్పారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే అణచివేతలు, అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు తీరని ద్రోహం చేసింది జగనే అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు ఇచ్చిన 23 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని ధ్వజమెత్తారు. చిలకలూరిపేట అభివృద్ధికి ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు చేస్తున్నారని దుయ్యబట్టారు. నాలుగున్నరేళ్ల పాలనలో జగన్ 120 సంక్షేమ పథకాలు రద్దు చేశారని చెప్పారు. ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన జగన్‌కు ఓట్లడిగే హక్కే లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించారని మండిపడ్డారు. జగన్ మోసకారి మాటలు మళ్లీ నమ్మితే రాష్ట్ర భవిష్యత్తే అంధకారం అవుతుందని ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.