సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలకు మరో 3 నెలల మాత్రం టైం ఉండటంతో.. ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో కాంగ్రెస్ అధికారం చేపట్టటంతో.. ఇప్పుడు ఏపీపై హస్తం పార్టీ దృష్టి సారించింది. తెలంగాణ విజభన అనంతరం ఏపీలో పూర్తిగా కనుమరుగైపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్సాహంతో అక్కడ కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం సంచలన నిర్ణయం తీసుకుంది హస్తం పార్టీ. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు ఏపీలో పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని కాంగ్రెస్ హై కమాండ్ యోచిస్తున్న సమచారం.
మొన్నటివరకు తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పోటీ నుంచి తప్పుకున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు.. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే వైఎస్‌పై ఉన్న సానుభూతి, అభిమానం కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయని హై కమాండ్ ఆలోచిస్తోంది. అయితే.. మొన్నటివరకు తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేస్తారన్న ప్రచారం జరగ్గా.. అలాంటిదేమీ జరగకుండా.. కేవలం పోటీకి దూరంగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు ముహూర్తం కూడా ఫిక్సయినట్టు సమాచారం అందుతోంది.
మరో రెండు, మూడు రోజుల్లో షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రకటిస్తూ.. ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. ఈ నెల 4వ తేదీన వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. అదే రోజు వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. షర్మిలతో పాటు సుమారు 40 మంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ప్రయత్నం జరిగింది. కానీ.. తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు ముఖ్య నేతలు అడ్డుకోవటంతో.. కేవలం మద్దతునే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ.. ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి పోటీగా షర్మిలకు కీలక బాధ్యలు అప్పగించి ఆమె సేవలను వాడుకోవాలని హస్తం పార్టీ చూస్తున్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa