కొత్త సంవత్సరం వేళ ప్రపంచం అంతా ఆనందంలో మునిగిపోతుంటే జపాన్ మాత్రం వరుస భూకంపాలతో వణికిపోయింది. సోమవారం భారీ భూకంపం ధాటికి కకావికలమైన జపాన్‌లో ఆ తర్వాత వరుసగా ప్రకంపనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటివరకు 155 సార్లు జపాన్‌లో భూమి కంపించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇక భూకంపం ధాటికి వేల ఇళ్లు, భవనాలు నేలకూలాయి. మరికొన్ని పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. మరోవైపు.. మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటివరకు జపాన్ భూకంపాల్లో చనిపోయిన వారి సంఖ్య 20 దాటినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇక భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న సముద్ర తీర ప్రాంతం అయిన ఇషికావాలో మరణాల సంఖ్య భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే జపాన్ వాతావరణ సంస్థ సోమవారం జారీ చేసిన సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించడం కాస్త ఊరట కల్పిస్తోంది. కానీ మరోసారి భూ ప్రకంపనలు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇషికావా ప్రిఫెక్చర్‌లోని పలు నగరాల్లో సునామీ అలలను స్థానిక అధికారులు గుర్తించారు. వాజిమా ప్రాంతంలో 1.2 మీటర్లు, కనజావా ప్రాంతంలో 90 సెంటీమీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డట్లు తెలిపారు. ఇషికావాలో 50 కి పైగా ఇళ్లు కుప్పకూలినట్లు సమాచారం వచ్చినట్లు స్థానిక ఫైర్ కేంద్రం వెల్లడించింది. మరోవైపు వాజిమా నగర కేంద్రంలో ఉన్న ఓ భవనంలో మంటలు చెలరేగి మరో 50 స్టోర్లు, ఇళ్లకు కూడా వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. తీర ప్రాంతమైన ఇషికావా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సోమవార సాయంత్రం 4 గంటలకు 7.6 తీవ్రతతో భూకంపాలు వరుసగా వచ్చాయని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. దీంతో జపాన్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. నీటి సరఫరా పైప్‌లైన్లు దెబ్బతినడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు చెప్పారు. బుల్లెట్ రైలు సేవలు నిలిచిపోగా.. మొబైల్ నెటవర్క్‌లు కూడా ఆగిపోయినట్లు పేర్కొన్నారు.
మరోవైపు ఇషికావా ప్రిఫెక్చర్‌లోని షికా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో పేలుడు సంభవించిందని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ తెలిపింది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ నుంచి వచ్చే కరెంట్ ఆగిపోయిందని.. కానీ బ్యాకప్ సిస్టమ్‌లను ఉపయోగించుకొని 2 అణు రియాక్టర్‌లు పని చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు.. జపాన్‌లో సంభవించిన భూకంపం ప్రభావం దక్షిణ కొరియాను కూడా తాకిందని ఆ దేశ అధికారులు వెల్లడించారు. దక్షిణ కొరియా తీర ప్రాంతాల్లో పలు చోట్ల సునామీ అలలను గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోసారి భారీ ఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.
జపాన్‌లో సోమవారం సంభవించిన భూకంపాల్లో భారీగా నష్టం సంభవించినట్లు ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిదా తెలిపారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. భవనాలు కూలిపోయాయని.. అగ్ని ప్రమాదాలు సంభవించినట్లు పేర్కొన్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. వాటిని స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కుప్పకూలిన భవనాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.