ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. ఇటీవల తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పరామర్శించనున్నారు. వాస్తవానికి గత నెలలోనే పరామర్శించేందుకు హైదరాబాద్ రావాలనుకున్నారు.. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయారు. కానీ కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. డిసెంబర్ 8న ఫామ్‌హౌస్‌లో జారి పడటంతో కేసీఆర్ తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. వెంటనే కేసీఆర్‌ను కుటుంబసభ్యులు హైదరాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎముక విరిగినట్లు గుర్తించి, శస్త్రచికిత్స నిర్వహించారు. కొద్దికాలం కేసీఆర్ యశోద ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ నేతలు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. గతనెల 15న చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. బంజారాహిల్స్ నందినగర్ లోని ఆయన పూర్వ నివాసానికి వెళ్లారు.