పల్నాడు జిల్లా గురజాల ఏఎస్సై తెలంగాణ మద్యం అక్రమ రవాణా కేసులో దొరికిపోయారు. గురజాల ఎక్సైజ్ ఎస్సై జయరావు సిబ్బందితో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో వాహన తనిఖీలు చేపట్టారు. దాచేపల్లి మండలం పొందుగుల చెక్‌పోస్టు దగ్గర తెలంగాణ నుంచి అనుమానాస్పదంగా వస్తున్న కారును ఆపి తనిఖీ చేశారు. డ్రైవర్ పక్క సీట్లో పోలీసు యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తుండగా.. కారును వేగంగా ముందుకు పోనిచ్చారు. పోలీసులు వెంబడించి వాహనాన్ని పట్టుకున్నారు. కారు డ్రైవర్ కొంత దూరం ముందుకు తీసుకుని వెళ్లి.. యూటర్న్ తీసుకుంటుండగా కారులో నుండి ఒక వ్యక్తి కిందకు దూకి పరారయ్యాడు. అందులో సుమారు రూ.48 వేల విలువచేసే 42 మద్యం సీసాలతోపాటు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. పోలీసు దుస్తుల్లో ఉన్న వ్యక్తి పరారయ్యారు. ఆయన గురించి ఆరా తీయగా.. గురజాల ఏఎస్సై స్టాలిన్‌గా గుర్తించారు. కారులో గురజాలకు చెందిన శ్రీనివాసరావు, కొండలను అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్సై పరారీలో ఉన్నట్టు సెబ్ పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఈ లిక్కర్ బాటిళ్లను తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు.ఈ ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.