విజయవాడ దుర్గమ్మ ఆలయంలో రద్దీ పెరిగింది. ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షల విరమణ ప్రారంభంకావడంతో.. భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ - హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. భవానీపురం దగ్గర ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. విజయవాడకు వచ్చే వాహనాలు అన్ని నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అటు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు కూడా నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు.
మరోవైపు భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ఈరోజు ఉదయం ఆలయ అధికారులు, అర్చక స్వాములు నాలుగు హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేశారు. గిరి ప్రదక్షిణ చేసుకుంటూ దీక్షల విరమణలకు వస్తున్నారు భవానీలు. అలాగే భవానీ భక్తులు నేతి టెంకాయలను సమర్పించి భవాని దీక్షలను విరమణ చేస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతుంది. భవానీ భక్తులు ప్రత్యేక కౌంటర్లలో ఇరుముడులను సమర్పిస్తున్నారు. ఈ ఏడాది 5 లక్షలకుపైబడి భవానీలు వస్తారని అంచనా వేస్తున్నారు. గిరి ప్రదక్షణలో భవానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జనవరి 7వ తేదీన పూర్ణాహుతితో భవానీ దీక్షా విరమణలు పూర్తవుతాయి.
ఇరుముడి సమర్పణకు మహా మండపంలో ప్రత్యేకంగా 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. మూడు షిఫ్ట్‌లలో 300 మంది గురు భవానీలు.. కేశఖండనశాలలో 850 మంది క్షురకులను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. 20 లక్షల లడ్డూలను.. 11 లడ్డూ ప్రసాదం కౌంటర్లు భవానీల కోసం ఏర్పాటు చేశారు. జల్లు స్నానాల కోసం సీతమ్మ వారి పాదాలు, పున్నమి ఘాట్ , భవానీ ఘాట్ల వద్ద 800 షవర్లు ఏర్పాటు చేశారు. 250 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు అధికారులు. భవానీ భక్తులందరికీ ఉచితంగానే అమ్మ దర్శనం కల్పిస్తున్నారు. భవానీ దీక్షల విరమణలు జరిగే ఐదు రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. అంతరాలయం దర్శనం రద్దు చేశారు. ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని భక్తులకు దుర్గగుడి అధికారుల విజ్ఞప్తి చేస్తున్నారు. భవానీ భక్తులు మాస్కులు కూడా ధరించాలని సూచిస్తున్నారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.. ఆలయంలో పెరుగుతున్న రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు కూడా చేశారు.