ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేశినేని నాని, చిన్ని వర్గాల మధ్య ఘర్షణ: ఎస్‌ఐకి గాయం.. రణరంగంగా టీడీపీ ఆఫీస్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 03, 2024, 08:26 PM

విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని మధ్య కొన్నాళ్లుగా సాగుతోన్న విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా, తిరువూరు టీడీపీ ఆఫీసు సాక్షిగా అన్నదమ్ముల మధ్య వర్గపోరు ఒక్కసారిగా భగ్గుమంది. నాని, చిన్ని వర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. జై చిన్ని, జై నాని అంటూ పోటాపోటీగా నినాదాలతో రణరంగాన్ని తలపించింది. ఈ నెల 7న చంద్రబాబు సభ నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలన కోసం ఎంపీ కేశినేని నాని.. తన అనుచరులతో కలిసి బైక్ ర్యాలీగా తిరువూరు టీడీపీ ఆఫీసుకు వచ్చారు. ఈ క్రమంలో నాని పొటో చిన్నదిగా వేశారంటూ ఆయన అనుచరులు పోస్టర్లు చించి, కుర్చీలు విసిరి రభస చేశారు. కొద్దిసేపటికి తన పరివారంతో కేశినేని చిన్ని ర్యాలీగా చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ సమయంలో పార్టీ కార్యాలయంలో ఎంపీ కేశినేని నాని కూర్చున్నారు. కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లను బయటకు రావాలని కార్యకర్తలు తలుపులు బాది నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఈ దశలో పోలీసులు జోక్యం చేసుకుని.. ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.


చంద్రబాబు సభ ఏర్పాట్ల కోసం తిరువూరు నియోజకవర్గ పార్టీ సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా.. భేటీకి వెళ్లకముందే పార్టీ కార్యాలయంలో కుర్చీలను కార్యకర్తలు విరగ్గొట్టారు. నాని, చిన్ని వర్గాల మధ్య కుర్చీలు విసురుకోడంతో ఎస్ఐ తలకు గాయమైంది. దీంతో ఎస్ఐను తీసుకుని పోలీసులు బయటకు వెళ్లారు. తిరువూరులో టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘర్షణ పతాక స్థాయికి చేరింది. అయితే, కేశినేని సోదరుల మద్య ఆది నుంచి వివాదమే నడుస్తోంది. గత ఎన్నికల్లో పూర్తిగా వైసీపీ గాలి వీచినప్పటికి విజయవాడ టీడీపీ ఎంపీగా మాత్రం నాని విజయం సాదించారు. అయితే, నాని విజయం కోసం అహర్నిశలు పని చేసిన ఆయన సోదరుడు చిన్ని.. ఎంపీకి నానికి వ్యతిరేకంగా బయటకు వచ్చి పని చేయడం మొదలుపెట్టారు. తనకంటూ సొంతంగా ఓ వర్గాన్ని తయారుచేసుకునే ప్రయత్నం చేశారు. అయితే, తన పార్లమెంట్ స్టిక్కర్‌ను వేసుకొని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఏకంగా సోదరుడుపైనే నాని పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో కలకలం రేపింది. తన అనుమతి లేకుండా, తనకు పార్లమెంట్ అధికారులు కేటాయించిన కారు స్టిక్కర్ ను ఫోర్జరీ చేసి వాడుకుంటున్నారని ఆరోపించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో అప్పటి నుంచి ఈ ఇద్దరి అన్నదమ్ముల వ్యవహరం వెలుగులోకి వచ్చింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com