వైఎస్ఆర్-టీపీ అధ్యక్షురాలు షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చాలా కాలం తర్వాత కలుసుకున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి ఆమె బుధవారం తాడేపల్లికి విచ్చేశారు. సాయంత్రం కడప నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆమె.. అక్కడ నుంచి సీఎం నివాసానికి వెళ్లారు. అనంతరం అన్న జగన్, వదిన భారతికి పెళ్లి శుభలేఖను అందజేశారు. అక్కడ అరగంటపాటు ఇద్దరితోనూ షర్మిల మాట్లాడారు. కాగా, అక్కడున్నవారితో ‘పెళ్లి కదా... అన్నకు చెప్పడానికి వచ్చాను’ అని షర్మిల అన్నారు. అయితే, మీడియాను లోపలికి మాత్రం అనుమతించలేదు.
కాగా, చాలాకాలం తర్వాత సోదరుడ్ని షర్మిల కలవడంతో ఇరువురి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందనే ఆసక్తి నెలకుంది. తన ఇంట్లో జరిగే తొలి శుభకార్యానికి హాజరుకావాలని అన్నను ఆహ్వానించారు. కానీ, గత కొన్నేళ్లుగా అన్నా, చెల్లెళ్ల మధ్య దూరం పెరుగుతూ వస్తుందనే వార్తలు వచ్చాయి. చివరకు వైఎస్ ఘాట్‌లో నివాళులర్పించే సమయంలోనూ ఇద్దరు వేర్వేరుగా వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. కాగా, భేటీ అనంతరం తాడేపల్లి నుంచి ఆమె నోవాటెల్ హోటల్‌కు బయలుదేరారు.
అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం.. ఆమె రాత్రి 8.50 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసి.. తన పార్టీ విలీనం, హోదాపై చర్చించనున్నారు. అయితే, ఆమె కాంగ్రెస్‌లో చేరికపై ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ అంతకుముందు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ సహా కుటుంబ సభ్యులకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వాగతం పలికారు. షర్మిల వచ్చిక కొద్దిసేపటికి తాడేపల్లికి వచ్చిన ఆర్కే.. రేపు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పారు. అంతేకాదు, ఆమె ఏపీ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే తాను కూడా ఆ పార్టీలో చేరతానని ఆర్కే పునరుద్ఘాటించారు. ఆ పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ విధానాలతో ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.