భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్(EaseMyTrip) కీలక నిర్ణయం తీసుకుంది.ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేయాలని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ సంస్థ దిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది. నిషాంత్ పిట్టి, రికాంత్ పిట్టి, ప్రశాంత్ పిట్టి దీనిని 2008లో స్థాపించారు. (Maldives row)
ప్రధాని మోదీ(Modi) గతవారం లక్షద్వీప్‌లో పర్యటించి సాహసాలు చేయాలనుకునేవారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. ఆ వెంటనే ఈజ్‌మైట్రిప్ స్పందించింది. 'లక్షద్వీప్(Lakshadweep)లోని బీచ్‌లు కూడా.. మాల్దీవులు, సీషెల్స్‌లో వలే బాగుంటాయి. మన ప్రధాని ఇటీవల వెళ్లిన ప్రాంతంలో పర్యటనల నిమిత్తం మా సంస్థ క్రేజీ ఆఫర్లు తీసుకురానుంది' అని వెల్లడించింది. చలో లక్షద్వీప్(Chalo Lakshadweep) హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. ఈలోపే వివాదం చెలరేగడంతో అక్కడి మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా ఈజ్‌మైట్రిప్ తాజా నిర్ణయం తీసుకుంది.
ఈ వివాదంపై మాల్దీవుల మాజీ మంత్రి అహ్మద్ మహ్లూఫ్ స్పందించారు. 'సన్నిహిత పొరుగుదేశంపై చేసిన వ్యాఖ్యలతో నెలకొంటున్న పరిణామాలపై ఆందోళన చెందుతున్నాను. మాల్దీవుల పర్యటనలను భారతీయులు బహిష్కరిస్తే.. అది మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇటువంటి ప్రచారం నుంచి మనం కోలుకోవడం కష్టం. అందుకే ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలి' అని సూచించారు. 'మా నేతలు చేసిన వ్యాఖ్యలపై భారతీయులు ఆగ్రహంగా ఉన్నారు. ఆ మాటలు సిగ్గుచేటు. వివక్షాపూరితమైనవని. ఇందుకు భారత్‌కు క్షమాపణలు తెలియజేస్తున్నాను. మా దేశానికి వ్యతిరేకంగా జరుగుతోన్న బాయ్‌కాట్ ప్రచారాన్ని ముగించండి'' అని మాల్దీవుల ఎంపీ ఎవా అబ్దుల్లా అభ్యర్థించారు.