నిత్యం లక్షలాదిమంది ప్రయాణికులు రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. అలా ప్రయాణించేవారికి లగేజీ సమస్య ఎదురవుతుంది. ముఖ్యంగా ప్రయాణాల సమయంలో లగేజీ సేఫ్టీపై భయం ఉంటుంది.. ఎవరైనా మన లగేజీ ఎత్తుకెళ్తే పరిస్థితి ఏంటనే టెన్షన్ ఉంటుంది. ముఖ్యంగా రాత్రివేళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. కుటుంబంతో కలిసి రైలు, బస్సుల్లో రాత్రివేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే ఎవరో ఒకరు జాగారం చేయాల్సిందే. ఎందుకంటే ఎవరైనా మన లగేజీ ఎత్తుకుపోతారేమోననే భయం మనకు కంటిమీద కునుకు రానివ్వదు. కానీ ఇలాంటి సమస్యకు పరిష్కారాన్ని చెప్తున్నాడు ఓ రైల్వే ఉద్యోగి.
తిరుపతి రైల్వే స్టేషన్లో చీఫ్ ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు శివరామకృష్ణ. రైల్వే ఉద్యోగిగా రైలు ప్రయాణం సమయంలో ప్రయాణికులు ఎదుర్కొనే ఈ సమస్యను రామకృష్ణ గమనించారు. తన కెరీర్లో ప్రయాణాలు చేస్తూ లగేజీ పోగొట్టుకున్న ఎంతోమంది ప్యాసింజర్లను చూశారాయన. దీంతో ఈ సమస్యకు ఓ సొల్యూషన్ కనిపెట్టాలని భావించారు రామకృష్ణ. అలా రూపొందించిందే ఈ అలెర్టీ అనే ఎలక్ట్రానిక్ డివైజ్. ఈ అలెర్టీ డివైజ్ చూడ్డానికి చిన్న ఛార్జర్ మాదిరిగా కనిపిస్తుంది. దీనిని చాలా సింపుల్గా వెంట తీసుకెళ్లవచ్చు. అలెర్టీ స్విచ్ ఆన్ చేసి బ్యాగులో ఉంచితే చాలు. ఎవరైనా మన బ్యాగును కదిపితే వెంటనే అలారమ్ సౌండ్ చేస్తుంది. మనల్ని అలెర్ట్ చేస్తుంది. దీంతో మన లగేజీ చోరీకి గురయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఈ అలెర్టీ డివైజ్ను లగేజీలో, మహిళల హ్యాండ్ బ్యాగుల్లో ఎక్కడైనా ఉంచొచ్చని రామకృష్ణ చెప్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు మన సామాగ్రిని కదిలిస్తే వెంటనే మనల్ని అప్రమత్తం చేస్తుందని చెప్తున్నారు.. మరోవైపు ఈ పరికరాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో బీటెక్ చదివిన సురేష్ అనే యువకుడికి రామకృష్ణ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం సురేష్ దీనిని ఉత్పత్తి చేసే పనిలో ఉన్నారు. అలాగే ప్రయాణికుల లగేజీ భద్రత కోసం రామకృష్ణ చేసిన ఈ నూతన ఆవిష్కరణను తోటి రైల్వే అధికారులు కూడా అభినందిస్తున్నారు.