విశాఖలో భారీగా మద్యం బాటిళ్లు దొరికాయి. ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలోని ఒక అపార్టుమెంట్‌లో విశ్రాంత నేవీ అధికారి ఇంట్లో అనధికారికంగా ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్మాకాలనీలో వీవీఆర్ రెసిడెన్సీ ఫ్లాట్ నెంబరు 301లో రిటైర్డ్ నేవీ అధికారి నీరజ్‌చౌదరి నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో మద్యం సీసాలు ఉన్నట్టు నగర టాస్క్‌ఫోర్స్ విభాగానికి సమాచారం వచ్చింది. స్థానిక పోలీసుల సాయంతో ఇంటిని తనిఖీ చేయగా మొత్తం 69 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో భారీగా మద్యం బాటిళ్లు దొరకడం కలకలంరేపింది. ఈ బాటిల్స్ ఎక్కడ నుంచి తెచ్చారనే కోణంలో ఆరా తీస్తున్నారు. నగరంలో ప్రజలు ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసులు హెచ్చరించారు. మరోవైపు విశాఖ నగర పోలీసు కమిషనర్ డాక్టర్ ఏ రవి శంకర్ ఆదేశాలతో త్వరలో ఎన్నికలు జరగనుండటంతో నగరంలో ఎటువంటి డబ్బులు, మద్యం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా నగరంలో పలు ప్రదేశాలలో అధికారులు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగర భద్రతను మరింత పెంచేలా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు.