ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. నైట్ హాల్ట్ అలవెన్స్ ఫిబ్రవరి ఒకటిన జీతంతో పాటే ఇచ్చేందుకు సంస్థ ఈడీ బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చారని ఎంప్లాయిస్ యూనియన్ తెలిపింది. ఈ అంశంపై సోమవారం ఆయనతో చర్చించినట్లు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, నరసయ్య తెలిపారు. మిగిలిన భత్యాలు బకాయిలతోసహా ఉద్యోగులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ప్రకటనలో తెలిపారు. మరోవైపు సంక్రాంతి పండగ సందర్భంగా మరో శుభవార్త ఇచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు అయ్యేలా కొత్త వేతనాలను వారికి చెల్లించనుంది. ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తోంది. ఇప్పటికే జీతాలతో పాటు అలవెన్స్‌లను కలిపి చెల్లిస్తోంది.. జనవరి 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. నైట్ అవుట్, డే అవుట్, ఓవర్ టైమ్ అలవెన్సులను అప్పటివరకు ఆలస్యంగా చెల్లిస్తూ వస్తోంది ప్రభుత్వం. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల అలవెన్సులు చెల్లింపులు ఆలస్యం అయ్యాయి. 2017నాటి పేరివిజన్ బకాయిలు, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్‌కు చెల్లించాల్సిన మొత్తాలను విడుదల చేయడంలో జాప్యం జరిగింది. ఇటీవలే వాటన్నింటినీ క్లియర్ చేయాలంటూ ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలను జారీ చేసింది. తాజాగా నైట్ హాల్ట్ అలవెన్సులను కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఫిబ్రవరి 1వ తేదీన అందే వేతనంలో నైట్ హాల్ట్ అలవెన్సులను కలిపి ఇవ్వాలని నిర్ణయించింది.ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.