సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే రైల్వే శాఖ పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తాజాగా, తెలుగు రాష్ట్రాల మధ్య మరో ఆరు రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లను సికింద్రాబాద్, తిరుపతి, కాకినాడ నగరాల మధ్య జనవరి 10 నుంచి 15 తేదీల్లో నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. జనవరి 10న తిరుపతి - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07055) రాత్రి 8.25గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.10 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకోనుంది. సికింద్రాబాద్ -కాకినాడ టౌన్ రైలు (07056) జనవరి 11 న రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి.. మర్నాడు ఉదయం 6.45 గంటలకు కాకినాడ పోర్టుకు చేరుకుంటుంది. అలాగే, తిరుగు ప్రయాణంలో కాకినాడ టౌన్ -సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07057) 12న రాత్రి 9 గంటలకు కాకినాడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్‌కు వస్తుంది.
అలాగే, సికింద్రాబాద్- కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07071) జనవరి 13న రాత్రి 9 గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం 8.30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. కాకినాడ టౌన్ - తిరుపతి ప్రత్యేక రైలు (07072) జవనరి 14న ఉదయం 10గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.20గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి -కాచిగూడ ప్రత్యేక రైలు (02707) జనవరి 15న తెల్లవారుజామున 5.30 గంటలకు బయల్దేరి అదేరోజు సాయంత్రం 5 గంటలకు కాచిగూడకు చేరుకోనుందని రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లకు ప్రయాణికులు ఆన్‌లైన్‌లో ఐఆర్సీటీసీ పోర్టల్‌లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని సూచించింది.