విజయవాడలో పోలీస్ వాహనంపై కూర్చొని సస్పెక్ట్ షీటర్, అతని స్నేహితుడు సెల్ఫీ తీసుకొని వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం చర్చనీయాంశమైంది. కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధి రాణిగారితోటలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 6న కృష్ణలంక స్టేషన్ రక్షక్ వాహనం రాణిగారితోటలో పెట్రోలింగ్ నిమిత్తం వెళ్లింది. సెంటర్లో ఆపి పోలీసులు వెళ్లగా.. సిబ్బంది లేని విషయాన్ని గమనించిన అదే ప్రాంతానికి చెందిన యువకులు వాహనాన్ని ఎక్కి, ఇంఛార్జ్ అధికారి సీట్‌లో కూర్చొని సెల్ఫీలు దిగారు. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ ఫోటోలు సోమవారం వైరల్ అయ్యాయి. అసాంఘిక శక్తులు పోలీస్ వాహనంపై కూర్చొని సెల్ఫీ దిగడంపై విమర్శలు వచ్చాయి. పోలీస్ వ్యవస్థపై భయం లేకుండా వ్యవహరించారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపించింది. దీనిపై సీఐ ఎంవీ దుర్గారావు స్పందించారు. శనివారం రాణిగారితోటలో జరిగిన వైఎస్సార్‌సీపీ నేత అవినాష్ కార్యక్రమానికి రక్షక్ వాహనంలో హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్, కానిస్టేబుల్ విజయ్ వెళ్లారన్నారు. వాహనం సెంటర్లో ఆపారని.. పోలీసులు లేని విషయాన్ని గమనించి సస్పెక్ట్ షీటర్ ఉస్తేల రామయ్య, అతడి స్నేహితుడు వాహనం ఎక్కి సెల్ఫీలు దిగినట్లు తెలిపారు.