తిరుమల నడకమార్గాల్లో అడవి జంతువుల నుంచి భక్తుల రక్షణ కోసం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు ఈవో ధర్మారెడ్డి. భక్తులు నిర్భయంగా నడకమార్గాల్లో శ్రీవారి దర్శనానికి రావొచ్చన్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ, ప్రభుత్వ అటవీ శాఖ అధికారులతో ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ డీఎఫ్‌వో, తిరుపతి సర్కిల్ సీసీఎఫ్, తిరుపతి డిఎఫ్‌వో లు కలిసి ప్రజంటేషన్ ద్వారా ఈవోకు వివరించారు. తిరుమల నడకదారిలో అడవి జంతువుల నుంచి భక్తుల రక్షణ కోసం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్‌లైఫ్), ఏపీ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రెండుసార్లు సమావేశమై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందన్నారు. నడక మార్గంలో భక్తుల రక్షణ కోసం తీసుకోవాల్సిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను నివేదికలో పొందుపరిచారని తెలియజేశారు. స్వల్పకాలిక చర్యలను కొనసాగించాలని సూచించినట్టు చెప్పారు.
అదేవిధంగా, టీటీడీ, ప్రభుత్వ అటవీ శాఖ ఇప్పటివరకు తీసుకున్న స్వల్పకాలిక చర్యలపై ఈవో కూలంకషంగా చర్చించారు. దీర్ఘకాలిక చర్యలైన అడవి జంతువుల పర్యవేక్షణ, అందుకు కావలసిన భవన సదుపాయం, సిబ్బంది, వ్యూలైన్ల ఏర్పాటు, బయోఫెన్సింగ్(పొదల కంచె), ఏరియల్ వాక్ వే, అండర్‌పాస్, ఓవర్‌పాస్‌ల కోసం స్థల ఎంపిక ఇతర మౌలిక వసతులపై చర్చించారు. వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్ వారికి లేఖ రాయాలని డీఎఫ్‌వోను ఆదేశించారు. ఇందులో ఏరియల్ వాక్‌వే, అండర్‌పాస్, ఓవర్‌పాస్ ఏర్పాటుకు ఆకృతులు అందించాలని, టీటీడీ అటవీ యాజమాన్య ప్రణాళికలకు తోడ్పాటునందించాలని విజ్ఞప్తి చేయాలని కోరారు. టీటీడీ అందించిన రూ.3.75 కోట్లతో వన్యప్రాణుల పర్యవేక్షణకు కావాల్సిన కెమెరా ట్రాప్‌లు, మానిటరింగ్ సెల్, వ్యూలైన్ల ఏర్పాటు, అవుట్ పోస్ట్‌ల నిర్వహణకు సత్వరం చర్యలు చేపట్టాలని తిరుపతి డిఎఫ్ఓను కోరారు. ఏడో మైలు నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం వరకు నడకదారికి ఇరువైపులా లైటింగ్ వసతి కల్పించాలని, మానిటరింగ్ సెల్ కోసం భవనాన్ని సమకూర్చాలని సీఈని కోరారు. తిరుమల నడకమార్గాల్లో ఏరోజుకారోజు వ్యర్థాలను తొలగించాలని, తద్వారా అడవి జంతువులు రాకుండా చేయాలని ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు.
శ్రీవారిని పలువురు ప్రముఖులు సోమవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తి సేవలో దర్శకుడు రాఘవేంద్రరావు, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనార్థం సినీనటుడు సుధీర్‌బాబు సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. స్థానిక కావేరీ అతిథిగృహం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని ఆయన దర్శించుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa