హిందూ వారసత్వ చట్టం ప్రకారం పూర్వీకుల ఆస్తికి కుమార్తెలన చట్టబద్ధమైన వారసుల హక్కులను తొలగించలేమని కర్ణాటక హైకోర్టు స్పష్ం చేసింది. కుమార్తెలు మరణించినా పిత్రార్జిత ఆస్తిలో వారి పిల్లలకు హక్కు ఉంటుందని ఇటీవల తీర్పు వెలువరించింది. తమ తోబుట్టువులు చనిపోయారని, వారికి గానీ, వారి పిల్లలకు ఆస్తిలో వాటాను ఎందుకు ఇవ్వాలని గదగ్ జిల్లా నరగుండ్ తాలూకా నివాసి చెన్నబసప్ప హొసమఠ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ సచిన్ శంకర్ మగదం.. పిటిషనర్ వాదనలను తోసిపుచ్చారు.
‘పిత్రార్జిత ఆస్తిలో హక్కు అనేది పిల్లలు (కుమార్తె, కుమారుడి)కు పుట్టుకతోనే వస్తుంది.. కుమారుడు చనిపోయిన తర్వాత అతని వారసులకు పిత్రార్జిత ఆస్తి హక్కు తరహాలోనే కుమార్తెలకూ వర్తిస్తుంది.. రాజ్యాంగ సమానత్వ సూత్రాలను న్యాయస్థానాలు కాపాడుతూ, లింగ వివక్ష లేకుండా చూడాలి’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ‘ఈ తీర్పు లింగ సమానత్వాన్ని నొక్కి చెబుతుంది.. కుమార్తె ఎప్పుడు మరణించిందనే దానితో సంబంధం లేకుండా కుమార్తెలు, వారి వారసులు జమైన వాటాను పొందేటట్లు నిర్ధారిస్తుంది.’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వినీత్ శర్మ కేసులో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి ప్రస్తావించారు.
సుప్రీంకోర్టు నిబంధనలు (సవరణ) పూర్వ సంఘటనల ఆధారంగా ప్రయోజనాలను అందజేస్తాయని, కుమార్తె వారసులకు పిత్రార్జిత హక్కును సూచిస్తాయని జస్టిస్ మగడం చెప్పారు. ‘సెక్షన్ 6(1)(a) పుట్టుకతో ఒక కుమార్తెను వారసత్వపు హక్కులో కొడుకు మాదిరిగా సహ-భాగస్వామ్యురాలిగా చేస్తే, మరణించిన కుమార్తె చట్టపరమైన వారసులు 2005లో సుప్రీంకోర్టు సవరణ ప్రయోజనాన్ని తిరస్కరించలేరు’ న్యాయమూర్తి పేర్కొన్నారు. వారసత్వ ఆస్తి విషయంలో గడగ్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి 2023 అక్టోబర్ 3న జారీ చేసిన ఉత్తర్వులను చెన్నబసవప్ప సవాలు చేశాడు. హిందూ వారసత్వ చట్టం, 2005 సవరణకు ముందే తన సోదరి మరణించిన కారణంగా ఆమె కుమార్తెలు నాగవ్వ, సంగవ్వల చట్టపరమైన వారసులకు సమాన వాటా మంజూరు చేసే ప్రాథమిక డిక్రీని సవరించాలని కోరాడు. అతడి వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు.