ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ మాల్దీవులు.. ఏడాదిన్నర క్రితమే మోదీ సర్కార్ యాక్షన్ ప్లాన్ షురూ

national |  Suryaa Desk  | Published : Tue, Jan 09, 2024, 07:51 PM

ప్రధాని మోదీ లక్షద్వీప్‌ పర్యటన తర్వాత మాల్దీవుల మంత్రులు మాట్లాడిన వెకిలి మాటలు భారతీయులకు ఆగ్రహం తెప్పించాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసే వరకూ ఇది వెళ్లింది. అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండే భారత్‌ దూరమైతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకున్న మాల్దీవులు నాయకత్వం.. మళ్లీ మన దేశాన్ని పొగడటం మొదలుపెట్టింది. ఇటీవల మాల్దీవుల్లో చైనా అనుకూల ప్రభుత్వం అధికారంలోకి రావడమే భారత్‌తో సంబంధాలు దెబ్బతినడానికి ప్రధాన కారణం. డ్రాగన్ ఎంట్రీతో అన్నదమ్ముల్లా ఉన్న భారత్, మాల్దీవులు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. శ్రీలంక, నేపాల్, మాల్దీవులు.. ఇలా భారత్ పొరుగున ఉన్న దేశం ఏదైనా సరే.. దాన్ని తమవైపు తిప్పుకోవడానికి చైనా అనుసరించింది దాదాపుగా ఒకే వ్యూహం. దేశం ఏదైనా.. ఓ పార్టీని, అందులోని ప్రధాన నాయకులను తమవైపు తిప్పుకోవడం.. ఆ తర్వాత వాళ్లు అధికారంలోకి రావడానికి అన్ని విధాలుగా సహకరించడం. అదే సమయంలో పెట్టుబడుల ఆశజూపి.. మెల్లగా భారత్‌కు దూరమయ్యేలా చేయడం. ఇదే చైనా చేస్తున్న పని. మారుతున్నదల్లా దేశాలు, నాయకులు మాత్రమే.


మాల్దీవులు చైనాకు దగ్గరవుతుండటం.. ఇండియా ఔట్ అని చైనా అనుకూల పార్టీ నేతలు పిలుపునివ్వడం, మన దేశాన్ని, ప్రధాని మోదీని హేళన చేసేలా ప్రవర్తించడం.. ఇవన్నీ ఎప్పటి నుంచో జరగుతున్నాయి. భారత ప్రభుత్వం కూడా మాల్దీవుల్లో మారుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. పర్యాటకంగా మాల్దీవులకు చెక్ పెట్టాలనే ఆలోచన ఉందో లేదో గానీ.. లక్షద్వీప్‌ను మాత్రం డెవలప్ చేయాలని కొంత కాలం క్రితమే మోదీ సర్కారు నిర్ణయించింది. ఏడాది క్రితమే ఇందుకు సంబంధించిన కార్యచరణ మొదలైంది. లక్షద్వీప్‌ చుట్టూ సముద్రమే. పర్యాటకంగా అభివృద్ధి చేయాలంటే టూరిస్టులు, స్థానికుల అవసరాలు తీర్చేంతగా నీటి లభ్యతను పెంచడం ఎంతో అవసరం. అందుకే భారత ప్రభుత్వం ఇజ్రాయె‌ల్‌ను సంప్రదించింది. ఇజ్రాయెల్‌లో నీటి వనరులు ఎంత తక్కువగా ఉంటాయో.. డిశాలినేషన్ ద్వారా ఆ దేశం సముద్రపు జలాలను లవణాలు లేకుండా చేసి.. తద్వారా పంట సాగు, ఇతర అవసరాలకు అనువుగా మార్చుకుంటుందో మనకు తెలిసిందే. భారత్ రిక్వెస్ట్ చేయగానే.. ఇజ్రాయెల్ లక్షద్వీప్‌ డిశాలినేషన్ ప్రోగ్రాం కోసం రంగంలోకి దిగింది. అది కూడా ఇప్పుడు కాదు.. ఏడాది కిందటే. ఈ విషయాన్ని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెల్లడించింది. తాము ఏడాది క్రితమే డీశాలినేషన్ ప్రోగ్రాం కోసం లక్షద్వీప్ వెళ్లామని.. ఈ ప్రాజెక్టు పనులను రేపటి (జనవరి 9) నుంచే మొదలుపెడతామని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సోమవారం ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఇదిగో లక్షద్వీప్ అందాలను చూడండంటూ కొన్ని ఫొటోలు, ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది.


అంతే కాదు.. టాటా గ్రూప్ కూడా లక్షద్వీప్‌లోని సుహేలి, కాడ్మాట్ దీవుల్లో రెండు రిసార్టులను నిర్మిస్తోంది. దీనికి సంబంధించి 2023 జనవరిలోనే ఒప్పందాలు కుదిరాయి. 2026 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుంది. లక్షద్వీప్‌కు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరగాలంటే అక్కడో ఎయిర్‌పోర్ట్ అవసరం. దీంతో పౌర అవసరాలతోపాటు.. సైనికంగానూ పనికొచ్చేలా.. లక్షద్వీప్‌లోని మినికాయ్ దీవిలో ఓ ఎయిర్‌పోర్ట్‌ను భారత ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా పర్యాటకులు త్వరగా అక్కడికి వెళ్లడంతోపాటు.. అరేబియా సముద్రంలో మన నిఘా వ్యవస్థను కూడా పటిష్టం చేయొచ్చు. ముందే చెప్పినట్టు అందమైన బీచ్‌లు, సహజ అందాలతో ఆకట్టుకునే లక్షద్వీప్‌ను టూరిస్ట్ అట్రాక్షన్‌‌గా డెవలప్ చేయడానికి కేంద్రం ముందే నిర్ణయించింది. దాదాపు ఏడాదిన్నర క్రితమే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిందని ఈ ఉదాహరణలను బట్టి అర్థం అవుతోంది. లక్షద్వీప్‌ బీచ్‌ల్లో మోదీ ఫొటో షూట్ జరగడం, ఆ తర్వాత మాల్దీవుల మంత్రులు అవాక్కులు చవాక్కులు పేలడం మాత్రమే మనకు కనిపిస్తోంది. కానీ మోదీ సర్కారు యాక్షన్ ప్లాన్ మాత్రం ఎప్పుడో మొదలైపోయింది. ఇటీవల జరిగిన మోదీ ఫొటోషూట్ ఎందుకయ్యా అంటే.. లక్షద్వీప్ పట్ల ప్రజల్లో ఆసక్తి పెంచడానికి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com