తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య వార్ కొనసాగుతోంది. ఆర్టీపీపీ వద్దకు జేసీ వాహనాలను ఆది వర్గం అనుమతించడం లేదు. దీంతో తాడిపత్రి సిమెంట్ కంపెనీల వద్ద జమ్మలమడుగు వాహనాలను అడ్డగించారు. జమ్మలమడుగు వాహనాలకు లోడింగ్ చేయొద్దని జేసీ వర్గం హుకుం జారీ చేసింది. ఆర్టీపీపీ వద్ద జేసీ వాహనాలకు లోడింగ్ చేయొద్దని ఆది వర్గం చెబుతోంది. ఇరువురి నేతల మధ్యలో ట్రాన్స్పోర్ట్ యాజమానులు నలిగిపోతున్నారు. జిల్లా సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీపీపీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
తమ వాహనాలను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డు కోవడంపై రగిలిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈసారి సహించేది లేదని.. తాను అదానీలా చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కండ కలవాడిదే రాజ్యమన్నట్లుగా భూపేష్‌రెడ్డి వర్గీయులు అదానీ కంపెనీ ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈమేరకు జిల్లా ఎస్పీకి జేసీ లేఖ రాయడంతోపాటు స్వయంగా రంగంలోకి దిగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం తాడిపత్రి నుంచి ఆర్టీపీపీ వరకు మూడు చోట్ల చెక్ పోస్టుల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
రాయలసీమ థర్మల్ పవర్‌ప్లాంట్ ఫ్లైయాష్ వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. కూటమి నేతలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంవో, జిల్లా అధికారులతో చంద్రబాబు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండాలని పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా చేయొద్దని సూచించారు.
ఈ వివాదం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్య సృష్టించేలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. శాంతిభద్రతల విషయంలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని.. కఠినంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. మొత్తం ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.