ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చలికి కుంపటి పెట్టుకున్న చిన్నారులు.. నిద్రలోనే ఏడుగురు సజీవదహనం

national |  Suryaa Desk  | Published : Wed, Jan 10, 2024, 09:14 PM

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘోర విషాదాలు చోటుచేసుకున్నాయి. చలికి ఇంటిలో కుంపటి పెట్టుకుని నిద్రిస్తున్న చిన్నారులు ఊపిరాడక రెండు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అమ్రోహా జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో ఉన్న బొగ్గుల కుంపటి పెట్టుకోవడం ప్రమాదానికి దారితీసిందని పోలీసులు తెలిపారు. గదిలో కార్బన్ డైయాక్స్ పెరిగి ప్రాణవాయువు తగ్గిపోవడమే మరణానికి కారణం కావచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.


రహీజుద్దీన్ కుటుంబంలోని ఏడుగురు సోమవారం రాత్రి నిద్రకు ఉపక్రమించగా.. మంగళవారం సాయంత్రం వరకు తలుపులు తెరవకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. తలుపులు పగులగొట్టి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. ఈ ఘటనలో రహీజుద్దీన్ ముగ్గురు పిల్లలు, మరో ఇద్దరు బంధువుల పిల్లలు చనిపోయారు. ఆయన భార్య, సోదరుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. అమ్రోహా ఎస్పీ ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.


మరోవైపు, లఖింపూర్ ఖేర్ జిల్లాలో ఇద్దరు పిల్లలు ఇలాగే ఊపిరాడక చనిపోయారు. చలి కాచుకోడానికి కుంపటి పెట్టుకుని తల్లిదండ్రులతో కలిసి నిద్రపోయిన అన్నదమ్ములు తెల్లారేసరికి విగతజీవులుగా పడి ఉన్నారు. తల్లిదండ్రులు కూడా అపస్మారక స్థితిలో పడి ఉండగా.. వారిని ఇరుగుపొరుగువారు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారని, ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు. బొగ్గుల కుంపటి వెలిగించినప్పుడు కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ మొదలైన హానికరమైన వాయువులు వెలువడతాయి. గది మూసివేస్తే బయట గాలి గదిలోకి ప్రవేశించదు. దీంతో ఆక్సిజన్ ప్రవాహాన్ని తగ్గించి, ఊపిరాడకుండా చేస్తుంది. ఇది మరణానికి కూడా దారితీస్తుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com