వైఎస్ జగన్ సారథ్యంలో వైఎస్సార్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పూర్తి మద్దతు ఉందని, వారి సహకారంతోనే త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. తాడేపల్లిలో గురువారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షులు పోతుల సునీత, రుతు కళ్యాణి నేతృత్వంలో రాష్ట్ర కమిటి సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మహిళా సాధికారత అమలు చేసినట్లు తెలిపారు. కులాలు మతాలకు అతీతంగా మహిళా సాధికారతకు సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. మహిళలకు ఉద్దేశించి రూపొందించిన అన్ని పథకాలూ మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికేనని అన్నారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి. దేశ స్థూల ఉత్పత్తి అభివృద్దికి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి అభివృద్దిలో మహిళలు ప్రధాన పాత్ర పోషించాలన్నదనే సీఎం జగన్ ఉద్దేశ్యమని అన్నారు. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిందని అన్నారు. మొత్తం జనాభాలో 50 శాతం మహిళలు ఉన్నప్పుడు వారికి 30 శాతం కన్నా 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం జగన్ ప్రధాని కలిసిన ప్రతిసారీ మహిళా సాధికారత, రిజర్వేషన్లు గురించి ప్రస్థావించడంతో కల సాకారమయ్యిందని అన్నారు.