అంగన్వాడీల సమ్మె శుక్రవారంతో 32వ రోజుకు చేరకుంది. ఈ సందర్భంగా న్యాయపరమైన డిమాండ్ల కోసం నెల రోజులుగా రోడ్డున పడ్డామని, సంక్రాంతి రోజైనా తమ కుటుంబం కడుపునిండా అన్నం తినేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జీతాలు పెంచాలని తిరుపతిలోని దీక్షా శిబిరంలో అంగన్వాడీ కార్యకర్తలు డిమాండు చేశారు.సమస్యలు పరిష్కరించకపోతే దీక్షా శిబిరాల్లోనే భోగి, సంక్రాంతి పండుగలను జరుపుకుంటామన్నారు.యూటీఎఫ్ నాయకలు ఎస్‌ఎస్ నాయుడు, ముత్యాల రెడ్డి, నిర్మల, రామచంద్రయ్య మద్దతు తెలిపిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వేణుగోపాల్, నాగరాజమ్మ తదితరులు పాల్గొన్నారు. పిచ్చాటూరులోని దీక్షా శిబిరంలో కూడా కార్యకర్తలు ప్లేట్లలో మట్టిపోసుకుని నిరసన తెలిపారు. సత్యవేడులో సర్వమత ప్రార్థనలు చేశారు. శ్రీకాళహస్తిలో అంగన్వాడీ కార్యకర్తలు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. గూడూరు, చంద్రగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లోనూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.