దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు చూపిస్తోంది. తాజాగా ఇదే కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నాలుగో సారి సమన్లు పంపించింది.ఈనెల 18న విచారణకు నోటీసులు జారీ చేసింది. ఇంతకు ముందు, కేజ్రీవాల్‌కు మూడు సమన్లు జారీ చేయగా..కానీ ఆయన ఒక్కసారి కూడా ఈడీ ముందు హాజరు కాలేదు. గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21, అలాగే, ఈ ఏడాది జనవరి 3న విచారణలో పాల్గొనాల్సిందిగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ, తొలి సమన్లలో కేజ్రీవాల్ ఎన్నికల సమావేశానికి వెళ్లగా, రెండో సమన్ల సమయంలో విపాసన కోసం వెళ్లారు.. మూడో సారి జారీ చేసిన నోటీసులను అస్సలు పట్టించుకోకపోవడంతో ఇవాళ నాలుగోవ సారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన తప్పకుండా ఈడీ ముందుకు రావాల్సిందేనని ఆ నోటీసుల్లో తెలిపింది. ఢిల్లీ లిక్కర్‌స్కామ్ 2021-22లో ఎక్సైజ్ పాలసీకి సంబంధించినది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దీని అమలుపై CBI విచారణకు సిఫారసు చేయగా.. వెంటనే ఆప్ ప్రభుత్వం 2022లో దాన్ని క్యాన్సిల్ చేసింది. ఈ కేసులో ప్రస్తుతం మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ జైలులో ఉన్నారు.మనీష్ సిసోడియాను CBI గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు చేయగా.. లిక్కర్ స్కామ్‌తో పాటు మనీలాండరింగ్ కేసులో అక్టోబర్ 4న సంజయ్ సింగ్ అరెస్టయ్యాడు.
అయితే ఈడీ నోటీసులపై ఆప్ నేతలు మండిపడుతున్నారు.. ఈ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడమే కేంద్రం ఏకైక లక్ష్యమని..ఈ ఏడాదిలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరి ఈసారైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.