ప్రతి రైల్వే ప్రయాణికుడికి 55 శాతం రాయితీ.. ప్రకటించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. అబ్బో ఇదేదో అదిరిపోయే వార్తలా ఉందే అనుకుంటున్నారా..? నిజమే, కానీ రైల్వే శాఖ మంత్రి చెప్పింది ఏంటంటే.. ఇప్పటికే అంత రాయితీ ఇస్తున్నారట. మీ ప్రయాణానికి రూ.100 ఖర్చు అవుతుందనుకుంటే.. అందులో రూ.45 మాత్రమే మీ దగ్గర్నుంచి తీసుకుంటున్నాం.. మరో రూ.55 రాయితీ ఇస్తున్నామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అందుకేనేమో బస్సు టికెట్లతో పోలిస్తే రైలు టికెట్ల ధరలు తక్కువగా ఉంటాయి. వందే భారత్ టికెట్ల ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. వాటి విషయంలోనూ ఈ రాయితీ వర్తిస్తుందట.
అబ్బా.. ఈ విషయాలన్నీ మాకెందుకంటారా..? ఇంతకు ముందు రైళ్లలో సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు రాయితీతో టికెట్లు ఇచ్చేవారు. లాక్‌డౌన్ తర్వాత అవన్నీ ఎత్తివేశారు. రెండున్నరేళ్లయినా రైల్వే శాఖ వాటి ఊసెత్తడం లేదు. ఇప్పటికైనా ఇస్తారేమోననే ఆశతో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు.. రైల్వే శాఖ మంత్రి ఈ 55 శాతం రాయితీ అనే సమాధానం చెప్పారు. అంటే ఇప్పటికే 55 శాతం డిస్కౌంట్ ఇస్తుంటే.. ఇంకా ఏమీ ఇవ్వమంటారోయ్ అనేది ఆయన పైకి చెప్పని సమాధానం. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు జరుగుతున్న సంగతి తెలుసు కదా. ఈ ప్రాజెక్ట్ పురోగతి ఎలా ఉందో పరిశీలించడానికి రైల్వే మంత్రి అహ్మదాబాద్ వెళ్లారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఈ కన్సెషన్ ప్రస్తావన తీసుకొచ్చారు.
2020 మార్చిలో కోవిడ్ కారణంగా లాక్‌డౌన్ విధించడానికి ముందు సీనియర్ సిటిజన్లకు, ప్రభుత్వ అక్రిడేషన్ పొందిన జర్నలిస్టులకు రైలు టికెట్లలో 50 శాతం రాయితీ కల్పించేవారు. 2022 జూన్‌లో పూర్తి స్థాయిలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కానీ ఈ రాయితీలను మాత్రం ప్రకటించలేదు. దీంతో పార్లమెంట్‌లోనూ ఈ రాయితీల విషయమై చర్చ జరిగింది. కానీ రైల్వే శాఖ మాత్రం ఈ రాయితీలు ఇచ్చేందుకు సుముఖంగా లేదు. ఎందుకంటారా..? 15 కోట్ల మంది సీనియర్ సిటిజన్ల ద్వారా రైల్వే శాఖ 2022-23లో దాదాపు రూ.2242 కోట్లు ఆర్జించింది. రాయితీ ఇస్తే ఆ ఆదాయంలో కోత పడుతుంది కదా.
మోదీ ప్రభుత్వం రైల్వేల రూపురేఖలు మార్చేస్తోంది. వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం మాత్రమే కాకుండా.. రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తోంది. రైల్వే నెట్‌వర్క్ విద్యుదీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. కొత్త లైన్లు వేస్తున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. ఇప్పటికే ప్రయాణికులు తక్కువ ధరకే టికెట్లను విక్రయిస్తూ.. ఆ నష్టాన్ని సరకు రవాణా ద్వారా భర్తీ చేస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రైల్వేలను ఆధునికీకరిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే పేదలపై భారం పడకుండా ఉండేందుకు జనరల్ బోగీలను పెంచితే బాగుంటుందనేది జనం మాట.