జమ్మూ కశ్మీర్‌లో ముష్కర మూకలు మరోసారి సైనిక వాహనాలే లక్ష్యంగా దాడికి తెగబడ్డాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సైనిక కాన్వాయ్‌పై పూంచ్ సెక్టార్‌లోని కృష్టగాటీ అటవీ ప్రాంతంలో అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు జరపడంతో తీవ్రవాదులు అక్కడ నుంచి పరారయ్యారు. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూబింగ్ ఆఫరేషన్ చేపట్టాయి. ఈ ఘటనపై ట్వీట్ చేసిన ఆర్మీ ‘శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పూంచ్ సెక్టార్‌లోని కృష్టగాటీ అటవీ ప్రాంతంలో సైనిక వాహనశ్రేణిపై అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.. ఈ ఘటనలో సైనికులు ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.. గాయాలు కాలేదు.. జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి’ అని పేర్కొంది.
పూంచ్ సెక్టార్‌లో తరుచూ జరుగుతున్న ఉగ్రదాడులను ఎదుర్కొనే వ్యూహాంపై నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ సహా ఆర్మీ ఉన్నతాధికారులు చర్చిస్తున్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. గత కొద్ది వారాల్లో జవాన్లు కాన్వాయ్‌పై జరిగిన రెండో దాడి ఇది. గత ఏడాది డిసెంబరు చివరి వారంలో పూంచ్‌లోని డేరా కి గలి వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు సైనికులు అమరులుకాగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ప్రస్తుతం దాడి జరిగిన కృష్టగాటీ ప్రాంతం.. డేరా కి గలికి 40 కి.మీ. దూరంలో ఉంటుంది. పీర్‌పంజాల్ ప్రాంతంలోని రాజౌరీ, పూంచ్‌లు 2003 నుంచి ఉగ్రవాదులకు స్థావరాలుగా ఉండగా.. 2021 అక్టోబరు నుంచి మాత్రమే భారీ దాడులను పునఃప్రారంభించారు. గత ఏడు నెలల్లో వేర్వేరు దాడుల్లో మేజర్లు, కమాండోలు సహా 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత రెండేళ్లలో 35 మంది జవాన్లు ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడులకు బలయ్యారు.
ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే గురువారం మాట్లాడుతూ.. రాజౌరీ, పూంచ్ ప్రాంతాల్లో ఉగ్రవాదులకు సహాయం చేయడంలో భారత శత్రువులు క్రియాశీల పాత్ర పోషిస్తూనే ఉన్నారని పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి అన్నారు. ‘గత ఐదు నుంచి ఆరు నెలల్లో రాజౌరీ, పూంచ్‌లలో తీవ్రవాదం పెరిగిపోయింది. ఇది ఆందోళన కలిగించే అంశం.. 2003కి ముందు ఆ ప్రాంతంలో ఉగ్రవాదం నిర్మూలన జరిగింది.., 2017/ 18 వరకు పరిస్థితి ప్రశాంతంగా ఉంది.. ఇప్పుడు, లోయలో పరిస్థితి సాధారణంగా ఉండటంతో మా విరోధులు అక్కడ చురుకుగా ఉన్నారు’అని ఆయన చెప్పారు. రాజౌరిలో పరిస్థితిని మెరుగుపరచడానికి చేపట్టిన తొమ్మిది పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ఆర్మీ చీఫ్ వెల్లడించారు. మెరుగైన గూఢచర్యం, పోలీసు, స్థానిక భద్రతా అధికారులతో సమన్వయం, స్థానికుల మానవ హక్కుల పట్ల గౌరవం ఉన్నాయి. పూంచ్‌లో జరిగిన ఉగ్రదాడి తరువాత అదుపులోకి తీసుకున్న ముగ్గురు పౌరులు మరణించిన నేపథ్యంలో ఈ రెండూ కీలకమైనవిగా మారాయి.