దాదాపు ఎనిమిదేళ్ల కిందట అదృశ్యమైన భారత వైమానిక దళానికి చెందిన విమాన శకలాలను తాజాగా గుర్తించారు. జులై 22, 2016లో గల్లంతైన ఏఎన్-32 విమాన శకలాలు బంగాళాఖాతంలో గుర్తించనట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక్రవారం వెల్లడించింది. చైన్నై తీరానికి 310 కి.మీ. దూరంలోని సముద్ర మట్టానికి 3.4 కి.మీ. అడుగున వీటిని గుర్తించామని తెలిపింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి చెందిన ఏయూవీ (నీటి అడుగున ప్రయాణించే వాహనం) సాయంతో భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కనుగొన్నట్లు పేర్కొంది.
వాటిని విశ్లేషించిన అనంతరం ఏఎన్-32 శకలాలుగా నిర్ధారించినట్లు వెల్లడించింది. 2016 జులై 22న ఉదయం 8.30 గంటలకు భారత వాయుసేనకు చెందిన ఏన్-32 కే-2743 విమానం చెన్నైలోని తాంబరం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి అండమాన్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌కు 29 మందితో బయల్దేరింది. కొద్దిసేపటికే విమానానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయి బంగాళాఖాతంలో అదృశ్యమైంది. దీనికి 16 నిమిషాల ముందు వరకు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌తో కమ్యూనికేషన్‌లో ఉన్న ఒక్కసారిగా తెగిపోయాయి. దీంతో వాయుసేన పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.
ఎటువంటి ఆచూకీ దొరక్కపోవడంతో అదే ఏడాది సెప్టెంబరు 16న విమానంలో ప్రయాణించిన వారి కుటుంబసభ్యులకు వైమానికదళం లేఖ రాసింది. గల్లంతైన ఏఎన్-32 కే-2743 విమాన ఆచూకీని తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, దానిలో అండర్ వాటర్ లొకేటర్ వ్యవస్థ లేకపోవడంతో ఎక్కడ ఉందో తెలుసుకోవడం క్లిష్టంగా మారిందని తెలిపింది. అందులో ఉన్నవారంతా చనిపోయారని భావించడం తప్పా మరో మార్గం లేదని అందులో పేర్కొంది.