ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తైవాన్ జనాలు తోపులు రా భయ్.. అధ్యక్ష ఎన్నికల్లో చైనాను ధిక్కరించే నాయకుడికే పట్టం

international |  Suryaa Desk  | Published : Sat, Jan 13, 2024, 09:51 PM

చైనాతో ముప్పు పొంచి ఉన్న వేళ తైవాన్‌లో నిర్వహించిన ఎన్నికల్లో అధికార డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (డీపీపీ)కి చెందిన లయ్ చింగ్-తే అధ్యక్షుడిగా విజయం సాధించారు. చైనా దురాక్రమణకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈసారి నిర్వహించిన తైవాన్ ఎన్నికలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. తైవాన్ ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతారోనని ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూసింది. అధికార డీపీపీ అభ్యర్థి లయ్ చింగ్-తే, ప్రధాన ప్రతిపక్షం కేఎంటీకి చెందిన హో యు-ఇహ్, తైవాన్ పీపుల్స్ పార్టీకి చెందిన కో వెన్-జె మధ్య జరిగిన త్రిముఖ పోరులో లయ్ చింగ్ విజేతగా నిలిచారు. ప్రస్తుత తైవాన్ అధ్యక్షురాలు త్సయి ఇంగ్-వెన్ స్థానంలో లయ్ చింగ్ బాధ్యతలు చేపడతారు. తైవాన్ అధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందిన త్సయి.. తమ దేశ స్వయంప్రతిపత్తికి కట్టుబడి చైనాను ధిక్కరించారు. ఇది డ్రాగన్‌కు ఆగ్రహం తెప్పించింది. 2016, 2020 ఎన్నికల్లో విజయం సాధించిన త్సయి.. మరోసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆమె వారసుడిగా లయ్ చింగ్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు.


చైనాను ఎదుర్కోవడంతోపాటు ఇతర విషయాల్లోనూ త్సయి విధానాలనే కొనసాగిస్తాయని లయ్ మాటిచ్చారు. తమకు ఆయుధ సాయం చేస్తున్న అమెరికాతో ఇప్పటి అధ్యక్షురాలిలాగే తాను కూడా బలమైన సంబంధాలను నెరుపుతానని, యూరప్ దేశాలతో సంబంధాలు బలోపేతం చేస్తాయని.. లయ్ తైవాన్ ప్రజలకు హామీ ఇచ్చారు. వైద్య విద్యను అభ్యసించిన లయ్.. తైవాన్‌ దక్షిణ ప్రాంత నగరమైన తైనాన్ మేయర్‌గా పని చేశారు. తైవాన్ స్వాతంత్య్రం కోసం ఆచరణాత్మక కార్యకర్తగా పనిచేస్తానని గతంలో లయ్ ప్రకటించారు. దీంతో అధ్యక్షుడిగా అతడు చైనాతో సంబంధాలను సరిగా నెరపగలడా? అని ఓ దశలో అమెరికా అనుమానించింది. కానీ వైఖరిని కొంత మేర మార్చుకున్న లయ్.. చైనా ముందుకొస్తే చర్చలు జరుపుతానని ప్రకటించారు. లయ్‌ ప్రమాదకరమైన వేర్పాటువాదని చైనా ముద్రవేసింది. అయితే చైనాతో ప్రస్తుతమున్న పరిస్థితిని కొనసాగిస్తానని.. శాంతి కోసం ప్రయత్నిస్తానని ఆయన ప్రకటించారు. శాంతి ఎంతో విలువైందన్న ఆయన.. యుద్ధంలో ఎవరూ విజేతలు కాలేరన్నారు. వన్ చైనా పాలసీని ఒప్పుకోవడం వల్ల నిజమైన శాంతి లభించదన్నారు. సార్వభౌమాధికారం లేని శాంతి నకిలీ అని.. అది మరో హాంగ్ కాంగ్ అవుతుందన్నారు.


తైవాన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లయ్ కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. అమెరికాతో దోస్తీ చేస్తూనే.. చైనాను నిలువరించాల్సిన పరిస్థితిలో తైవాన్ ఉంది. రష్యా ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన తర్వాత.. చైనా సైతం తైవాన్‌ను ఆక్రమిస్తుందనే ప్రచారం జరిగింది. ద్వీప దేశమైన తైవాన్‌కు చేరువగా యుద్ధ నౌకలను మోహరించిన చైనా.. పదే పదే యుద్ధ విమానాలను పంపించి తైవాన్‌ను ఆందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో తైవాన్ కోసం తాము రంగంలోకి దిగుతామని అమెరికా ప్రకటించడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అమెరికా, చైనా మధ్య మాటల యుద్ధం నడిచింది. కానీ ఆ తర్వాత ఉద్రిక్తతలు తగ్గాయి. డీపీపీ పార్టీకి చెందిన అభ్యర్థి వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం చైనాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ తైవాన్ ప్రజలు మాత్రం చైనాను నిలువరించాలంటే ఆ పార్టీనే సరైందనే అభిప్రాయాన్ని ఓటు ద్వారా వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com