ఈరోడ్ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి కి చెందిన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు మూడో రోజైన బుధవారం కూడా తనిఖీలు చేశారు.ఈరోడ్‌కు చెందిన అవల్‌పూందురైకు చెందిన రామలింగం అనే వ్యాపారవేత్తకు ఎన్‌ఆర్ రియల్ ఎస్టేట్, టోల్ ప్లాజా, కల్యాణ మండపాలు, టార్చ్ పిండిమిల్లు ఇలా అనేక వ్యాపారాలున్నాయి. వీటికి ఆయన కుమారుడు సూర్యకాంత్ సహా మరికొందరు డైరెక్టర్లుగా ఉన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నడుపుతోంది.అయితే, గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రామలింగం ఆస్తులు భారీగా పెరిగాయి. దీనికి కారణం నాటి ముఖ్యమంత్రి ఈపీఎస్ బంధువు కావడంతో రామలింగం ఆస్తులు బాగా కూడబెట్టుకున్నారనే ప్రచారం జరిగింది. అదేసమయంలో భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ నెల 7వ తేదీ నుంచి రామలింగం, ఆయన బంధువులకు చెందిన గృహాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు మూడోరోజైన బుధవారం కూడా కొనసాగాయి.