తిరుమల తొక్కిసలాట ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విషాద ఘటనపై టీటీడీ ఛైర్మన్, సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలని సూచించారు. తానే క్షమాపణ చెప్పినప్పుడు... మీకు చెప్పడానికి నామోషీ ఏమిటని ప్రశ్నించారు. తాను మాత్రమే దోషిగా నిలబడాలా? అని ప్రశ్నించారు. వీఐపీ ట్రీట్మెంట్ తగ్గించాలని. కామన్ మేన్ ట్రీట్మెంట్ పెంచాలని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గం కుమారపురంలో గోకులం షెడ్లను పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే, చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి మీరంతా ఓట్లు వేశారని ఎక్కడ తప్పు జరిగినా స్పందించే గుణం ఉండాలని అందుకే తిరుపతి తొక్కిసలాట ఘటనపై మనస్పూర్తిగా క్షమాపణ కోరానని పవన్ అన్నారు. గోకులాల ద్వారా చిన్న, కౌలు రైతులు బాగుపడతారని పవన్ చెప్పారు. వైసీపీ పాలనలో 268 గోకులం షెడ్లను నిర్మిస్తే... ఈ ఆరు నెలల్లో తమ ప్రభుత్వంలో 12,500 షెడ్లను నిర్మించామని తెలిపారు. భవిష్యత్తులో 20 వేల గోకులాలను నిర్మిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో అలవాటు పడిన కొందరు అధికారులు పని చేయడం మానేశారని పవన్ మండిపడ్డారు. తనకు అధికారం అంటే అలంకారం కాదని చెప్పారు. ఎవరైనా ఇష్టానుసారం వ్యవహరిస్తే తొక్కి నార తీస్తానని హెచ్చరించారు. 15 ఏళ్లకు తక్కువ కాకుండా కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. తనకు డబ్బు, పేరు మీద ఇష్టం లేదని... తనకు బాధ్యత మాత్రమే ఉందని అన్నారు. పిఠాపురం నుంచి జిల్లాల పర్యటనను మొదలు పెడతానని చెప్పారు.