పాతికేళ్లుగా బీజేపీకి ఢిల్లీలో అధికారం దక్కలేదని, దీంతో ఇక్కడి ప్రజలపై ఆ పార్టీ ద్వేషం పెంచుకుందని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. అందుకే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని నేర రాజధానిగా మారుస్తోందని మండిపడ్డారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, గ్యాంగ్ వార్‌లు నిత్యకృత్యమైన నేపథ్యంలో మహిళలు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటే భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.రోహింగ్యా చొరబాటుదారుల పేరుతో పూర్వాంచలి, దళితుల ఓట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నట్లు ఆరోపించారు. ఈ చర్యలతో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఆపార్ట్‌మెంట్లకు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవడానికి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు నిధులు మంజూరు చేస్తామన్నారు.