ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్‌కు జాక్‌పాట్.. సింధు నదిలో భారీగా బంగారం నిల్వలు

international |  Suryaa Desk  | Published : Fri, Jan 10, 2025, 09:53 PM

పాకిస్తాన్. నానాటికీ పేద దేశంగా మారిపోతోంది. ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని పట్టి పీడిస్తోంది. రోజువారీ బండి నడిపించాలంటే ఇతర దేశాల దగ్గరో లేక ప్రపంచ బ్యాంకు వద్దో నిత్యం అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఉగ్రవాదం, అంతర్గత పోరు, సైనిక తిరుగుబాటుతో ఎప్పుడూ ఆ దేశంలో అశాంతి నెలకొంటూనే ఉంది. అంతేకాకుండా పాక్‌ను ప్రపంచ దేశాలు ఉగ్రవాద దేశంగా చూస్తుండటంతో ఆ దేశాన్ని ఆదుకునే పరిస్థితి కూడా లేకపోయింది. ఫలితంగా అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోవడంతో పాక్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తన్నితే బూరెల బుట్టలో పడినట్లు.. దిక్కుతోచని స్థితిలో ఉన్న పాకిస్తాన్‌కు బంగారం లాంటి ఆఫర్ వచ్చింది. భారీ బంగారం నిల్వలు ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్నట్లు తెలవడం ఇప్పుడు ఆ దేశానికి కొంత ప్రాణం వచ్చినట్లయింది. ఇలాంటి పురాతన నది ఇప్పుడు పాకిస్తాన్ భవిష్యత్తును మార్చే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.


పురాతన నది అయిన సింధు నదిలో భారీగా బంగారు నిల్వలు ఉన్నట్లు తాజాగా తేలింది. ఈ సింధు నదిలో 600 బిలియన్ పాకిస్తానీ రూపాయలు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.18,500 కోట్ల విలువైన సంపద ఉందని అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. హిమాలయాల నుంచి పుట్టే సింధు నది పాకిస్తాన్‌లో ఎక్కువ భాగం ప్రవహిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ జిల్లాలో భారీ స్థాయిలో బంగారం, ఇతర ఖనిజాలు ఉన్నాయని తాజాగా వెల్లడైంది. బంగారం నిక్షేపాలు దాదాపు 32.6 మెట్రిక్ టన్నుల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. 600 బిలియన్ పాకిస్తాన్ రూపాయల విలువైన ఈ బంగారం అటాక్‌ జిల్లాలోని 32 కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉందని పంజాబ్ మైనింగ్ శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ వెల్లడించారు.


ఈ నేపథ్యంలోనే పాకిస్తానీ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. సింధు నదిలో లభించే బంగారం పాకిస్తాన్ ఉత్తర పర్వత ప్రాంతాల నుంచి వేగంగా ప్రవహించే నదిలోకి వస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ఆ బంగారం అంతా నదీ గర్భంలోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. 3200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ సింధు నది ప్రపంచంలోనే అతిపెద్ద నదుల్లో ఒకటిగా నిలిచింది. బంగారం కలిగి ఉన్న ఈ సింధు నదిలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిషేధిస్తూ సెక్షన్ 144 అమలు చేసినట్లు స్థానిక నివేదికలు పేర్కొన్నాయి. బంగారం వంటి విలువైన ఖనిజాలు దేశ ఖజానాకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని పంజాబ్ ప్రావిన్స్ హోంశాఖ వెల్లడించింది.


ప్రస్తుతం శీతాకాలంలో సింధు నదిలో నీటిమట్టం క్రమంగా తగ్గుతున్నందున.. ఈ వార్తలు వెలుగులోకి రావడంతో.. స్థానికులు నదీ గర్భం నుంచి అక్రమంగా బంగారాన్ని సేకరిస్తారని అక్కడి ప్రభుత్వం భయపడుతోంది. పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వే నివేదిక ప్రకారం.. హిమాలయ ప్రాంతం నుంచి బంగారం వస్తోందని.. అదంతా షెషావర్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరుకుపోతుందని తెలిపింది. 6-10 మిలియన్ ఏళ్ల క్రితం రెండు టెక్టానిక్ ప్లేట్లు ఢీకొన్న తర్వాత హిమాలయాలు, సింధు నది ఉద్భవించాయి. అయితే నీటి ప్రవాహం కారణంగా హిమాలయాల నుంచి బంగారు కణాలు సింధు నదిలోకి చేరుతున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com