ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా బిగ్ బాష్ లీగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా సిడ్నీ థండర్స్, హోబార్డ్ హరికేన్స్ జట్లు శుక్రవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన డేవిడ్ వార్నర్.. తన బ్యాట్‌తో తన తలపై బాదుకున్నాడు. అయితే ఇది కావాలని చేసింది కాదు. బౌలర్ వేసిన బంతిని బౌండరీ బాదే క్రమంలో ఇది జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
అసలేం జరిగిందంటే..
బిగ్ బాష్ లీగ్ 2024-25 సీజన్‌లో డేవిడ్ వార్నర్ సిడ్నీ థండర్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. లీగ్‌లో భాగంగా సిడ్నీ థండర్స్, హోబార్ట్ హరికేన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హోబార్ట్ హరికేన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో డేవిడ్ వార్నర్ సేన బ్యాటింగ్‌కు దిగింది. అయితే రిలే మెరిడిత్ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతికి ఓ ఆశ్చర్యకర ఘటన జరిగింది.
రిలే మెరిడిత్ ఆఫ్ స్టంప్ లైన్ మీదుగా ఫుల్ డెలివరీ వేశాడు. ఈ బంతిని వార్నర్ మిడ్ ఆన్ దిశగా స్ట్రైట్‌గా బలంగా కొట్టాడు. అయితే బంతి తగలగానే బ్యాట్ హ్యాండిల్ దగ్గర విరిగిపోయింది. అనంతరం బ్యాట్ తిరిగి వెళ్లి వార్నర్ హెల్మెట్ వెనకభాగం వైపు తాకింది. అయితే బంతి హెల్మెట్‌కు తగిలాక వార్నర్ షాక్ అయ్యాడు. ఈ ఘటనలో అతడికి స్వల్పంగా దెబ్బతలిగింది. కానీ హెల్మెట్ ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీబీఎల్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 66 బంతుల్లో 88 రన్స్ చేశాడు. అనంతరం హోబార్ట్ హరికేన్స్.. 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. టిమ్ డేవిడ్ 38 బంతుల్లో 68 రన్స్ చేసి జట్టును గెలిపించాడు.