జనవరి 6వ తేదీన కెనడా ప్రధాన మంత్రి తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అలాగే లిబరల్ పార్టీ అధ్యక్ష పదవీ బాధ్యతల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు వివరించారు. అయితే ఈ స్థానాల్లోకి మళ్లీ ఎవరు వస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈక్రమంలోనే తాజాగా లిబరల్ పార్టీ కీలక ప్రకటన చేసింది. తమ పార్టీ అధ్యక్షుడిని మార్చి 9వ తేదీన ఎన్నుకుంటామని ప్రకటించింది. అయితే ఆ పార్టీ అధ్యక్ష పదవిలోకి రాబోయే వ్యక్తే ఆ దేశ ప్రధాని కూడా అవుతాడని అంతా భావిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2015లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కెనడా ప్రధాన మంత్రి బాధ్యతలను చేజిక్కుంటున్నారు జస్టిన్ ట్రూడో. అయితే ఈమధ్య కాలంలో సొంత పార్టీ ఎంపీల నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరోవైపు అమెరికా నుంచి కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి మొదలు అయింది. ఇటీవలే అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. పదవీ బాధ్యతలు స్వీకరించకముందే కెనడాపై 25 శాతం సుంకాలు విధిస్తామని తెలిపారు. అలాగే వలసలు, అక్రమ రవాణా నిరోధించకపోతే కెనడాను తమ దేశ 51వ రాష్ట్రంలో చేర్చుకుంటామని ప్రకటించారు.
ఇలా ఓవైపు సొంత పార్టీ నేతలే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేయడం, మరోవైపు ఇతత దేశాల నేతలు ఇబ్బంది పెట్టడంతో.. తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు జస్టిన్ ట్రూడో. ఈక్రమంలోనే తాను అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని డిసైడ్ అయ్యారు. జనవరి 6వ తేదీ రోజు తాను కెనడా ప్రధాని పదవితో పాటు, లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనుకుంటున్న వివరించారు. అలాగే కొత్త నేతను ఎన్నుకున్న తర్వాతే ఇదంతా జరుగుతందని చెప్పుకొచ్చారు. కొత్త ప్రధాని ఎంపిక ప్రక్రియను కొనసాగించేందుకు మార్చి 24వ తేదీ వరకు పార్లమెంటును వాయిదా వేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో స్పష్టం చేశారు.
ఇక అప్పటి నుంచి కెనడా తదుపరి ప్రధాని ఎవరనే దానిపై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. మార్చి 9వ తేదీన పార్టీ అధ్యక్షుడు ఎవరో తేలుస్తామని పార్టీ చెప్పగా.. ప్రధాని కూడా ఆయనే అవుతాడని అంతా డిసైడ్ అయిపోయారు. ముఖ్యంగా ఈ పదవిని చేజిక్కుంచుకునేందుకు అనేక మందే లైన్లో ఉన్నారు. కానీ ఎక్కువగా ఈ ఐదుగురిలోనే అధ్యక్ష పదవి వరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వారిలో భారత సంతతికి చెందిన ఎంపీలు అనితా ఆనంద్, జార్జ్ చాహల్, చంద్ర ఆర్యలతో పాటు క్రిస్టినీ ఫ్రీలాండ్, మార్క్ కార్నీ పేర్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.