దేశీయ స్టాక్ మార్కెట్లు ఆకట్టుకుంటున్నాయి. కోవిడ్ కాలంలో భారీగా పడిపోయినా వేగంగా పుంజుకున్నాయి. కీలక రంగాల్లోని కంపెనీలు రాణించడంతో మదుపరులకు భారీ లాభాలు వచ్చాయి. మార్కెట్లలో చిన్న మదుపరులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పవచ్చు. 18- 35 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పబ్లిక్ ఇష్యూకు చాలా కంపెనీలు వస్తున్నాయి. గత సంవత్సరంలో రూ.1.7 లక్షల కోట్లు సమీకరించాయి కంపెనీలు. ఇక ఈ ఏడాదిలో సుమారు రూ.2 లక్షల కోట్లు సేకరించేందుకు 90 కంపెనీలకుపైగా ఐపీఓలకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే మీరు ఐపీఓకు అప్లై చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.
దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు ఒక కొత్త కంపెనీలో ఇన్వెస్టే చేయాలనుకున్నప్పుడు ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కొత్త వ్యాపారం, పోటీ లేకుండా ఉండడం, పోర్ట్ ఫోలియోను వైవిధ్యంగా ఉంచుకునేందుకు ఐపీఓకు దరఖాస్తు చేయవచ్చు. అలాగే కంపెనీకి బలమైన ప్రాథమిక అంశాలు ఉన్నాయో లోవో చూడాలి. అలా ఉన్నప్పుడు ఆ ఐపీఓను పరిశీలించవచ్చు. మంచి యాజమాన్యం, కంపెనీ గత చరిత్ర, గత కొన్నేళ్లుగా వచ్చిన లాభ నష్టాలు, భవిష్యత్తు అంచనాలు వంటి విషయాలను కచ్చితంగా పరిశీలించాలి.
పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చే డబ్బులను దేనికోసం ఉపయోగిస్తున్నారో తనిఖీ చేయాలి. కొన్ని ఐపీఓలు ఇప్పటికే ఉన్న ప్రమోటర్ల షేర్లను విక్రయిస్తుంటాయి. తాజా షేర్లకన్నా ఆఫర్ ఫర్ సేల్ వాటాలే ఉంటాయి. ఇలా సేకరించే డబ్బులు కంపెనీలకు వెళ్లవు. ఇలాంటి సమయంలో వ్యాపార విస్తరణకు ఐపీఓ నిధులను వినియోగిస్తామని చెప్పే కంపెనీలపై దృష్టి పెట్టడం మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొన్ని కంపెనీలు లోన్లు చెల్లించేందుకే ఐపీఓకు వస్తాయి. అలాంటి వాటిని అనుమానించాల్సిందే. వీటికి దూరంగా ఉండడమే మంచిది. కొంత మంది ప్రమోటర్లు తమ వాటా తగ్గించుకునేందుకే ఐపీఓకు వస్తారు. ఇలా ఒకేసారి షేర్లు విక్రయిస్తుంటే అనుమానించాలి.
మంచి కంపెనీల షేర్లు ఐపీఓలో రాకున్నా ఆ తర్వాత ధరలు తగ్గినప్పుడల్లా కొనుగోలు చేస్తూ ఉండాలి. గత సంవత్సరం ఐపీఓకు వచ్చిన కొన్ని కంపెనీల షేర్లు ఇప్పుడు అందుబాటు ధరలోనే ఉంటాయి. దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టాలి. కొన్న కంపెనీల ఐపీఓలకు పెద్ద ఎత్తున ప్రచారం ఉంటుంది. గొప్పలు చెబుతుంటారు. మార్కెట్ వాటా, మార్కెట్ విలువ అధిక అంచనాలు సృష్టిస్తుంటారు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల వలలో పడకూడదు. కంపెనీ గురించి తగినతంగా పరిశోధించకుండా పెట్టుబడి పెట్టకూడదు. సరైన విలును అంచనా వేసేందుకు స్వతంత్ర సంస్థల నివేదికలను పరిశీలించాలి.
మార్కెట్లు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. కొన్నిసార్లు వృద్ధి దశలో ఉన్నప్పుడు ఐపీఓల విలువలూ అధికంగా ఉంటాయి. మంచి కంపెనీల షేర్లు సెకండరీ మార్కెట్లలోనూ అందుబాటు ధరలో ఉంటాయి. లిస్టింగ్ లాభాలు అనే ఆలోచన మానుకుని దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. హైరిటర్న్స్ వస్తాయని ఐపీఓల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ, దీర్ఘకాలంలో నష్టపోయిన వారు తక్కువగా ఉంటాలని సూచిస్తున్నారు.