ప్రియురాలితో కలిసి విమానం ఎక్కిన యువకుడు.. టేకాఫ్ అయిన తర్వాత ఇరువురి మధ్య గొడవ మొదలైంది. వాగ్వాదం తీవ్రకావడంతో ఆవేశంతో యువకుడు.. విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి దూకే ప్రయత్నం చేశాడు. దీంతో తోటి ప్రయాణికులు హడలిపోయారు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని లారెన్స్ లోగాన్ విమానాశ్రయంలో జనవరి 7న చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్యూర్టోరికోకు చెందిన మోరెల్స్ టెర్రోస్ అనే యువకుడు.. అతడి గర్ల్‌ఫ్రెండ్ కలిసి జనవరి 7 రాత్రి లారెన్స్ లొగాన్ ఎయిర్‌పోర్ట్‌లో జెట్‌బ్లూ ఎయిర్‌లైన్ విమానం ఎక్కారు.
ప్యూర్టారికోలోని శాన్ జౌన్‌కు వెళ్తోన్న ఈ జంట మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆవేశంగా సీటులో నుంచి లేచిన టెర్రోస్... విమానం ఎమర్జెన్సీ ద్వారం దగ్గరకు వెళ్లాడు. డోర్ లాక్ తెరిచి కిందికి దూకేందుకు యత్నించాడు. దీంతో ఒక్కసారిగా అందులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. క్యాబిన్ సిబ్బందితో పాటు వారు వెంటనే అప్రమత్తమై అతడ్ని అడ్డుకున్నారు. కొద్దిసేపటి తరువాల సమీపంలోని విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని దింపి.. భద్రతా సిబ్బందికి అతడ్ని అప్పగించారు. మసాచుసెట్స్ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు.
అతడికి బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం.. పలు ఆదేశాలు జారీ చేసింది. విచారణ నిమిత్తం మసాచుసెట్స్‌కి తప్ప భవిష్యత్తులో మరే ప్రాంతానికి ప్రయాణం చేయరాదని ఆదేశించింది. తల్లిదండ్రులతోనే ఉండాలని సూచించింది. ఘటన తర్వాత అందులోని ప్రయాణికులను మరో విమానంలో తరలించినట్టు జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు విచారణ చేపట్టారు. ఆ విమానంలో 161 మంది ప్రయాణికులు ఉన్నారని, అతడి చర్యల వల్ల వారిందరి భద్రత ప్రమాదంలో పడిందని తెలిపారు. ‘ఇది అత్యంత దురదృష్టకర సంఘటన.. నేను దీనిని క్రిమినల్ చర్యగా కాకుండా మానసిక సమస్యగా చూస్తున్నాను.. అతడు తిరిగి సాధారణ స్థితికి చేరుకోడానికి సహకరించాల్సిన అవసరం ఉంది.. యువకుడైన అతడికి చాలా భవిష్యత్తు ఉంది.’ అని అటార్నీ రాబర్ట్ కార్మెల్-మోంటేస్ వ్యాఖ్యానించారు. కాగా, గత నెలలో అలస్కా ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు సైతం ఇలాగే ప్రవర్తించాడు. ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచి.. విమానం రెక్కపైకి ఎక్కాడు. అయితే, ఆ సమయానికి తోటి ప్రయాణికులంతా విమానం దిగిపోయారు.