సాధారణంగా సేవింగ్స్ అకౌంట్‌లో ఉండే నగదుకు చాలా తక్కువ వడ్డీ రేట్లు కల్పిస్తుంటాయి బ్యాంకులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ వంటి దిగ్గజ బ్యాంకుల్లో 4 శాతంలోపే వడ్డీ ఉంటుంది. చాలా మందికి పొదుపు ఖాతాపై వడ్డీ వస్తుందని కూడా తెలియదు. అంత తక్కువగా ఉంటుంది. అయితే ఈ బ్యాంకులో మాత్రం ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లతో సమానంగా ఇస్తోంది. అదే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్. సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ రేట్లను సవరిస్తున్నట్లు తెలిపింది. పెంచిన వడ్డీ రేట్లు జనవరి 10, 2025 నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది.
లేటెస్ట్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు..
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్ల సవరణ తర్వాత కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. రూ. 1 లక్ష వరకు ఖాతాలో బ్యాలెన్స్ ఉన్నట్లయితే వడ్డీ రేటు 3 శాతంగా ఉంటుంది. ఇక రూ.1 లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు నగదు నిల్వ ఉన్నట్లయితే ఆయా పొదుపు ఖాతాలకు వడ్డీ రేటు 5 శాతంగా ఉంటుంది. కొత్తగా రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు స్లాబ్ తీసుకొచ్చింది. దీని ద్వారా 7 శాతం మేర వడ్డీ ఇస్తోంది. ఇక రూ.25 లక్షల నుంచి రూ.1 కోటి వరకు బ్యాలెన్స్ ఉంటే 7.25 శాతం వడ్డీ ఇస్తోంది. రూ.1 కోటి నుంచి రూ.25 కోట్లలోపు బ్యాలెన్స్ ఉంచితే వడ్డీ రేటు 7.50 శాతం వర్తిస్తుంది. ఇక రూ.25 కోట్లు ఆపైన బ్యాలెన్స్ ఉంచితే వడ్డీ రేటు 7.80 శాతం ఇస్తోంది.
సేవింగ్స్ వడ్డీ రేట్లు ఎలా లెక్కిస్తారు?
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. సేవింగ్స్ అకౌంట్లోని బ్యాలెన్స్‌పై వడ్డీ రేట్లు అనేది రోజు వారీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆధారంగా లెక్కిస్తారు. మూడు నెలలకు ఒకసారి సేవింగ్స్ అకౌంట్లో ఈ వడ్డీని జమ చేస్తారు. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ రేటు స్లాబ్స్ వర్తిస్తాయి. ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే ఎక్కువ లాభం పొందవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా ఎక్కువ వడ్డీ ఇస్తోందని చెప్పవచ్చు. అలాగే తమకు ఇష్టమొచ్చినప్పుడు ఎలాంటి ఛార్జీలు లేకుండానే నగదు ఉపసంహరించుకోవచ్చు. ఎలాంటి అదనపు ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంక్ కస్టమర్లకు ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
ఈక్విటీస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులోనూ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం ఉంటుంది. రూపాయి చెల్లించకుండానే ఈ ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఏదైనా జరిగి బ్యాంక్ దివాలా తీసినా, ప్రకృతి వైపరీత్యాలతో బ్యాంకు నష్టపోయినా ఖాతాదారులకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. మరోవైపు.. ఈ బ్యాంకులో ప్రస్తుతం రూ.3 కోట్లలోపు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 3.50 శాతం నుంచి 8.25 శాతం మేర వడ్డీ రేట్లు కల్పిస్తోంది.