లార్సెన్ అండ్ టుబ్రో ఛైర్మన్.. ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్‌పై నెట్టింట ట్రోల్స్ మోత మోగుతోంది. పని గంటలపై ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై పెద్ద చర్చ నడుస్తోంది. "ఇంట్లో కూర్చొని భార్య ముఖం ఎంత సేపు చూస్తారు.? ఆదివారాలు కూడా పనిచేయండి. వారానికి 90 గంటలపాటు పనిచేయండి.' అని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార వర్గాల నుంచి చాలా మంది ప్రముఖులు తమ అభిప్రాయం చెబుతున్నారు. ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. జీవితాన్ని శాశ్వత ఆఫీసు షిఫ్టుగా మారిస్తే అది వినాశనానికి దారి తీస్తుందే గానీ.. విజయానికి కాదని అన్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఆప్షన్ కాదు అవసరం అని ఆయన వ్యాఖ్యలు చేశారు.
హర్ష్ గోయెంకానే కాదు ఇంకా బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొణే కూడా సుబ్మహ్మణ్యన్ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టాప్ పొజిషన్‌లో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ఇంకా ప్రముఖ క్రీడాకారిణి గుత్తా జ్వాలా సహా పలువురు స్పందించారు. ఈ క్రమంలోనే నెటిజన్ల నుంచి కూడా తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్నారు ఎల్ అండ్ టీ బాస్.
ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన వేతనం గురించి పెద్ద చర్చే నడుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆయన ఏకంగా రూ. 51 కోట్ల వేతనం అందుకున్నారట. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 43.11 శాతం ఎక్కువట. ఈ మేరకు కంపెనీ తన వార్షిక నివేదికలో తెలిపింది. ఆయన రెమ్యునరేషన్‌లో బేస్ శాలరీ రూ. 3.6 కోట్లు కాగా.. ముందస్తు అవసరాల కిందట రూ. 1.67 కోట్లు అందుకున్నారు. ఇక కమీషన్ రూపంలోనే ఆయనకు రూ. 35.28 కోట్లు వచ్చాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ. 10.5 కోట్లు ఉన్నాయి.
ఇదే ఫైనాన్షియల్ రిపోర్టులో ఎల్ అండ్ టీ కంపెనీలు పనిచేసే ఉద్యోగుల సగటు వేతనం ఎంతో కూడా ప్రస్తావించింది. సంస్థలోని కీలక పదవుల్లోని వ్యక్తులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మినహాయించి కంపెనీ ఉద్యోగుల సగటు వేతనం రూ. 9,77,099 గా ఉంది. ఇదంతా మళ్లీ పురుష ఉద్యోగులకు సంబంధించిన డేటానే. ఇదే మహిళల విషయానికి వస్తే వారికి సగటు జీతం గత ఆర్థిక సంవత్సరంలో రూ. 6.76 లక్షలుగానే ఉంది. ఈ లెక్కన కంపెనీ ఉద్యోగుల సగటు జీతంతో పోలిస్తే.. ఎల్ అండ్ టీ బాస్ జీతం ఏకంగా 535 రెట్లు అని తెలుస్తోంది. ఈ లెక్కన రోజుకు 13 గంటల చొప్పున పనిచేసినా ఏడాదికి సగటున రూ. 9 లక్షలు పొందుతుంటే.. బాస్ పొజిషన్‌లో ఉండి అన్ని కోట్లు తీసుకుంటున్నారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.