ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీవితంలో సక్సెస్ కావాలంటే వదిలించుకోవాల్సిన అలవాట్లు, వెంటనే గుడ్ బై చెప్పేయండి

Life style |  Suryaa Desk  | Published : Fri, Jan 10, 2025, 11:20 PM

సక్సెస్ అనేది జీవితంలో మనం ఏం సాధించామని చెప్పడానికి ఓ కొలమానం. జీవితంలో సక్సెస్ సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. విజయం సాధించడం అనేది ఎవరికైనా ఒక లక్ష్యం కావచ్చు. అయితే ధైర్యం, ప్రయత్నాలతోనే మాత్రమే ఒక వ్యక్తి విజయం సాధిస్తాడు. ప్రతి అడుగులో కొత్త సవాల్ ఉంటుంది. ఈ సవాళ్లకు వెనుకాడకూడదు. మునుపటి కంటే మెరుగ్గా మారడానికి చిన్న లేదా పెద్ద ప్రయత్నం చేయాలి. ఈ ప్రాసెస్‌లో కొన్ని సార్లు నిరాశను ఎదుర్కొవాల్సి ఉంటుంది. మరికొన్ని సార్లు విజయం మీ సొంతమవుతుంది.


జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని మంచి విషయాలను అలవాటు చేసుకోవాలి. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ అలవాట్లను సకాలంలో గుర్తించాలి. లేదంటే మీరు పురోగతి సాధించలేరు. కొన్ని అలవాట్లకు గుడ్ బై చెబితేనే మీరు జీవితంలో ఖచ్చితంగా విజయం సాధించగలరు. ఒక వ్యక్తి వదిలించుకోవాల్సిన అలవాట్లు గురించి తెలుసుకుందాం. వాటిని వదిలించుకుంటేనే జీవితంలో విజయం సాధించగలుగుతారు.


సాకులు చెప్పడం


చాలా మంది తాము అనుకున్న పనుల్ని సరైన టైంకి చేయరు. ఏదో ఒక సాకు చెప్పి ఆ పనుల్ని వాయిదా వేసుకుంటారు. ఈ రోజు నేను అక్కడ వెళ్లాను.. అందుకే ఈ పని చేయడం కుదరలేదు. రేపు చేస్తాను ఇలా ఏదో ఒక సాకు చెప్పి పనులు వాయిదా వేస్తుంటారు. ఇలా పనులు వాయిదా వేసుకుంటూ పోతే జీవితంలో ఏం సాధించలేరు. ఎక్కడ వేసినా గొంగలి అక్కడే ఉంటుందన్న సామెత అందరికీ తెలిసిందే. అందుకే చేయాల్సిన పనుల కోసం ఒక ప్లాన్ సిద్ధం చేసుకోండి. పక్కా ప్రణాళికతో పనులు చేసుకుంటేనే ముందుకు సాగుతారు. లేదంటే జీవితం అనే రేసులో వెనుకబడాల్సిందే.


ప్రతికూల ఆలోచనలు


చాలా మంది ప్రతి దానికి నెగటివ్‌గా ఆలోచిస్తారు. ఇలా ప్రతికూలంగా ఆలోచించేవారు.. ముందుకు సాగలేరు. వారు మనస్సులో ఎప్పుడూ వైఫల్యాలే భావనలుగా గుర్తుకువస్తాయి. ఇలాంటి వారు చుట్టూ ఉన్న మంచిని చూడలేరు. నిరాశను మాత్రమే ఫీల్ అవుతారు. మనం ఈ పని చేయలేం.. ఫలానా పనిచేస్తే పక్కన వాళ్లు ఏం అనుకుంటారో అన్న భావలో ఉంటారు. ఇలాంటి ఆలోచనలకు చెక్ పెట్టాలి. ప్రతికూలంగా ఆలోచించడం వల్ల మీ ఆత్మ విశ్వాసం దెబ్బతింటుంది. జీవితంలో ఎదగాలంటే ఈ అలవాటును ఖచ్చితంగా వదిలించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.


లక్ మీద ఆధారపడటం


మహాత్మా గాంధీ 'మనిషి తన విధికి తానే సృష్టికర్త' అని చెప్పారు. అయితే, మనలో చాలా మంది చేసే పని కన్నా.. ఎప్పుడూ అదృష్టం మీదనే ఆధారపడతారు. అదృష్టం కంటే కష్టపడి పని చేస్తేనే విజయం సాధిస్తారన్న ధీమా వారిలో ఉండదు. సక్సెస్ సాధించిన వ్యక్తులు అదృష్టం మన చేతుల్లో లేదని.. కష్టపడి పనిచేయడం మాత్రమే మన చేతుల్లో ఉందని నమ్ముతారు. అందువల్ల ఒక వ్యక్తి తన అదృష్టాన్ని కష్టపడి సంపాదించుకోవాలి. అంతేకానీ, ఏదో జరిగిపోతుంది.. త్వరలోనే జీవితం మారిపోతుందన్న భ్రమలో ఉండిపోకూడదు. కష్టపడి సాధిస్తేనే విజయం తథ్యం.


సమయం వృధా


టైమ్ ఈజ్ మనీ అంటారు చాలా మంది. అంటే సమయమే డబ్బుతో పాటు సక్సెస్‌ను తెచ్చిపెడుతుంది. అలాంటి సమయానికి మనం విలువ ఇవ్వాలి. అంతేకానీ ఆ సమయాన్ని వృధా చేయకూడదు. చాలా మంది టైమ్‌కి అనుకున్న పనులు చేయరు. ఊరికే టైమ్‌ని వేస్ట్ చేస్తుంటారు. టీవీలు చూడటం, స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోవడం వంటి హాబీలతో సమయం వృధా చేసుకుంటారు. జీవితంలో ఏమైనా సాధించాలి అనుకుంటే కచ్చితంగా సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు సాధించినవారు టైమ్‌కి ఎంతో విలువ ఇస్తారు. అందుకే సమయాన్ని వృధా చేయడం మానుకోవాలి.


అసూయ


​ఎదుటివారి సక్సెస్‌ని చూసి అసూయ పడేవారు ఎప్పటికీ కూడా విజయం సాధించలేరు. సక్సెస్ అయిన వారు కేవలం తన పనిని మాత్రమే అంచనా వేస్తాడు. దానినే నమ్ముకుంటారు. ఇతరుల విజయాల్ని కూడా ప్రశంసిస్తారు. ఎవరైనా మంచి పని చేస్తే పొగిడితే.. చెప్పలేని ఆనందాన్ని ఇస్తుంది. అయితే, ఒకరిపై అసూయ పడటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఒకరు ఎదుగుతున్నారన్న అసూయ.. మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతుంది. మీరు కెరీర్ ఎదగకుండా ఉండేలా చేస్తుంది. కాబట్టి.. ఇతరుల్ని చూసి అసూయ పడకుండా ఉండాలి. వారి సాధించిన విజయాలను చూసి మెచ్చుకోవాలి. మనం కూడా విజయం సాధించేలా అడుగులు వేయాలి.


అనారోగ్యకరమైన జీవనశైలి


ఈ రోజుల్లో చాలా మంది ఎలా పడితే అలా లైఫ్‌స్టైల్ లీడ్ చేస్తున్నారు. ఎలా పడితే అలా తినడం, సరైన టైమ్‌కి నిద్రపోకపోవడం, ఆలస్యంగా నిద్రలేవడం, చెడు అలవాట్లతో జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇలాంటి అలవాట్లు మనల్ని జీవితం అనే రేసులో వెనకపడేలా చేస్తాయి. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఆరోగ్యంగా ఉండటం కూడా ముఖ్యం. అందుకే ఈ అలవాట్లకు గుడ్ బై చెప్పేయండి. సరైన తిండి, టైమ్‌కి నిద్రపోవడం, హెల్తీ హ్యాబిట్స్ అలవర్చుకోవడం నేర్చుకోండి.


ఇతరుల్ని నిందించడం


చాలా మంది తప్పులు చేస్తుంటారు. కానీ, వారు చేసిన తప్పులకు కూడా ఇతరుల్ని నిందిస్తారు. ఇలాంటి అలవాటు ఉన్నవారు జీవితంలో ముందుకు సాగలేరు. ఒకరి మీద ఏడుస్తూ ఉంటే.. మీరు అక్కడే ఆగిపోతారని గుర్తించుకోండి. మీ తప్పుల్ని గుర్తించి.. అంగీకరించినప్పుడు మిమ్మల్ని మీరు మెరుగుపర్చుకుంటారు. తప్పుల్ని నుంచి ఏదైనా నేర్చుకుంటే జీవితంలో విజయం సాధ్యమవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com