మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో పథకాలు ఉన్నప్పటికీ ఉద్యోగులు ఎక్కువగా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ ఎంచుకుంటారు. వీటినే ట్యాక్సే సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ అని కూడా అంటారు. ఇందులో హైరిటర్న్స్ రావడంతో పాటు ఇన్వెస్టర్లకు పన్ను ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తాయి. దీంతో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ప్రాథమికంగా ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత మార్గాల్లో పెట్టుబడి పెడతాయి. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ 80 శాతం నిధులను ఈక్విటీల్లో 20 శాతం ఇతర ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ పెట్టుబడుల్లో అత్యంత ఆదరణ పొందాయని చెప్పవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్‌తో పాటు హైరిటర్న్స్ అందిస్తుంటాయి. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద ఈ పథకాలకు ప్రతి సంవత్సరం రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఈ పథకాల్లో 3 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.500గా ఉండగా గరిష్ఠ పరిమితి ఏమీ లేదు. ఒకేసారి లంప్‌సమ్ పెట్టుబడి పెట్టవచ్చు లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ క్రమంలో గత 10 సంవత్సరాల్లో హైరిటర్న్స్ ఇచ్చిన టాప్-5 స్కీమ్స్ గురించి తెలుసుకుందాం.
క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్..
క్వాంట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ బెంచ్‌మార్క్ బీఎస్ఈ 500 టీఆర్ఐగా ఉంది. గత 10 సంవత్సరాల్లో వార్షిక రిటర్న్స్ 20.88 శాతంగా ఉన్నాయి. ఇక సిప్ రిటర్న్స్ చూసుకుంటే 23.65 శాతంగా ఉన్నాయి. దీని ప్రకారం పదేళ్ల క్రితం నెలకు రూ.10 వేల చొప్పున సిప్ పెట్టుబడి ప్రారంభించి ఇప్పటి వరకు కొనసాగించి ఉన్నట్లయితే ఇప్పుడు ఆ విలువ రూ.41.94 లక్షలు అవుతుంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్
ప్రభుత్వ బ్యాంక్ ఆధ్వర్యంలోని ఏఎంసీకి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్స్ గత 10 సంవత్సరాల కాలంలో లంప్‌సమ్ రిటర్న్స్ 17.55 శాతంగా ఉన్నాయి. ఇక సిప్ పెట్టుబడి రిటర్న్స్ వార్షికంగా 20.42 శాతంగా ఉన్నాయి. దీని ప్రకారం నెలకు రూ.10 వేల చొప్పున సిప్ పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు రూ.35.22 లక్షలు వస్తాయి.
జేఎం ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్
ఈ స్కీమ్ ఎక్స్‌పెన్స్ రేషియో 1.27 శాతంగా ఉంది. ఇక గత 10 సంవత్సరాల్లో సీఏజీఆర్ రేటు 17.01 శాతంగా ఉంది. బెంచ్‌మార్క్ రిటర్న్స్ 13.86 శాతానికి బీట్ చేసింది. ఇక సిప్ రిటర్న్స్ 19.79 శాతంగా ఉన్నాయి. దీని ప్రకారం నెలకు రూ.10 వేలు సిప్ చేసినట్లయితే ఇప్పుడు ఆ విలువ రూ.34.04 లక్షలుగా ఉంది.
జీఎస్‌పీ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్
ఈ స్కీమ్ బెంచ్ మార్క్ బీఎస్ఈ 500 టీఆర్ఐగా ఉంది. ఎక్స్‌పెన్స్ రేషియో 0.74 శాతంగా ఉంది. అలాగే లంప్‌సమ్ పెట్టుబడి సీఏజీఆర్ రేటు గత 10 సంవత్సరాల్లో 16.72 శాతంగా ఉంది. ఇక సిప్ పెట్టుబడి రిటర్న్స్ సగటున 19.01 శాతంగా ఉన్నాయి. దీని ప్రకారం పదేళ్ల పాటు నెలకు రూ.10 వేల చొప్పున సిప్ చేస్తే ఇప్పుడు ఆ విలువ రూ.32.79 లక్షలు అవుతుంది.
బంధన్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్..
బంధన్ బ్యాంక్ అనుబంధ ఏఎంసీ బంధన్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకొచ్చిన ట్యాక్స్ సేవర్ ఫండ్ ఎక్స్ పెన్స్ రేషియో 0.66 శాతంగా ఉన్నాయి. అలాగే గత పదేళ్లలో ఈ స్కీమ్ సగటు వార్షిక రాబడి 16.17 శాతంగా ఉంది. ఇక సిప్ పెట్టుబడి వార్షిక రాబడి 18.11 శాతంగా ఉంది. దీని ప్రకారం నెలకు రూ.10 వేలు సిప్ చేస్తే ఇప్పుడు రూ.31 లక్షలు అవుతుంది.