చైనాలో వేగంగా విస్తరిస్తోన్న హ్యుమన్ మోటాన్యుమోవైరస్ కేసులు భారత్‌లోనూ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా గుజరాత్లో మరో కేసు బయటపడింది. ఇప్పటి వరకూ బాధితులంతా చిన్నారులే కాగా.. తొలిసారి ఓ వృద్ధుడికి ఈ వైరస్ సోకింది. అహ్మదాబాద్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడికి హెచ్ఎంపీవీ వైరస్ నిర్దారణ అయ్యింది. దీంతో గుజరాత్లో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య మూడుకు చేరుకోగా.. దేశంలో మొత్తం బాధితుల 9కు చేరింది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటన ప్రకారం.. ఆస్తమాతో బాధపడుతున్న వృద్ధుడు కొద్ది రోజుల కిందట అనారోగ్యానికి గురయ్యాడు. అతడ్ని కుటుంబసభ్యులు బుధవారం ఆసుపత్రిలో చేర్పించగా.. గురువారం నిర్వహించిన పరీక్షల్లో హెచ్ఎంపీవీ ఉన్నట్టు తేలింది.
ప్రస్తుతం అతడికి ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని, ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. అంతేకాదు, బాధితుడికి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదని తెలిపారు. అటు, ఈ వైరస్ నిర్దారణ అయిన చిన్నారుల అందరి పరిస్థితి నిలకడగా ఉందని, వారు కోలుకుంటున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కాగా, హెచ్ఎంపీవీ ఎక్కువగా వృద్ధులు, చిన్నారులపై ప్రభావం చూపుతుంది. వృద్ధులలో తేలికపాటి నుంచి తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. వైరస్ సంక్రమించిన వ్యక్తిలో సాధారణంగా దగ్గు, ముక్కు దిబ్బడ, ముక్కు కారటం, గొంతు నొప్పి, శ్వాస ఆడకపోవడం, జ్వరం, అలసట వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
ఇక, పిల్లల విషయానికి వస్తే సాధారణంగా తేలికపాటి జలుబు లాంటి సంకేతాల నుంచి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి లక్షణాలు గుర్తించారు. వైరస్ తీవ్రత బ్రాంకైటీస్ లేదా న్యుమోనియాకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధకశక్తి బలహీనంగా ఉండేవారికి ప్రమాదం ఎక్కువ. ఇక, దేశంలో మొదటిసారి బెంగళూరులో సోమవారం ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ నిర్దారణ అయ్యింది. తర్వాత చెన్నై, గుజరాత్, నాగ్‌పూర్, ముంబయిలో కేసులు బయటపడ్డాయి. కాగా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతోందని ఐసీఎంఆర్ తెలిపింది. ఈ వైరస్ కేసులు చైనాను దాటేసి ఇతర దేశాల్లోనూ ఇప్పుడు కేసులు నమోదు అవుతున్నాయని స్పష్టం చేసింది.