దాదాపు ఆరు నెలల కిందట తమిళనాడులోని మదురై సమీపం తిరుప్పోరూరు కందసామి ఆలయాన్ని దర్శించుకున్న దినేశ్ అనే యువకుడు ఐ-ఫోన్ పొరపాటున హుండీలో పడటంతో దానిని దేవుడికి చెందిందిగానే పరిగణిస్తామని అధికారులు తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ ఫోన్‌ను సొంతదారుడు రూ.10వేలకు వేలంలో దక్కించుకున్నాడు. చెన్నై అంబత్తూరు వినాయకపురానికి చెందిన దినేశ్.. గతేడాది ఆగస్టులో తన కుటుంబంతో కలిసి కందసామి ఆలయానికి వెళ్లాడు. దర్శనం అనంతరం అక్కడ హుండీలో కానుకలు వేస్తుండగా అతడి జేబులో నుంచి ఐ-ఫోన్ జారిపడింది. దీంతో అతడు ఆందోళన చెందుతూ కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. అక్కడే ఉండి తీసి ఇవ్వమని అడిగాడు. కానీ క్యూలైన్‌లో ఎక్కువ మంది భక్తులు వేచి ఉండేసరికి అతడు త్వరగా బయటకు రావాల్సి వచ్చింది. దీనిపై ఆలయ నిర్వాహకులకు ఫిర్యాదు చేయగా.. హుండీలో పడినవన్నీ దేవుడికే సొంతమని చెప్పారు.
చివరకు మొబైల్ ఫోన్‌లో ఉన్న సిమ్, మెమరీ కార్డు మాత్రమే అధికారులు అప్పగించారు. కానీ, హుండీలో పడిన ఏ వస్తువైనా దానిని ఆలయ ఖజానాలో జమచేస్తారని, అది దేవునికే చెందుతుందని అన్నారు. హుండీలో వేసిన ఏ కానుకైనా భగవంతునికే చెందడం తమ ఆలయ ఆచారమని, తిరిగి ఇవ్వాలని కోరడం తమ నిబంధనలు అనుమతించవని వివరించారు. అయినా నిబంధనల్ని క్షుణ్ణంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దీని గురించి తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈ అంశాన్ని తాను పరిశీలిస్తానని చెప్పారు
అప్పట్లో ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీలు కూడా దీనిపై స్పందించాయి. హుండీలో బాంబు పడినా దేవుడుకే చెందుతుందా? అంటూ పలువురు విమర్శలు గుప్పించారు. అయితే, ఎట్టకేలకు హుండీలో వచ్చిన వస్తువులకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. ఆలయ నిబంధన ప్రకారమే వేలంలో పాల్గొన్న దినేశ్.. రూ.10వేలకు తన ఐ-ఫోన్‌ని తిరిగి దక్కించుకోవడం విశేషం. ఆరు నెలల తర్వాత తన ఖరీదైన మొబైల్ ఫోన్ తిరిగి రావడంతో అతడి సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది.