దేశంలో మోసాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. తాజాగా, ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’ పేరుతో దందా నిర్వహిస్తున్న గ్యాంగ్ పోలీసులకు చిక్కింది. మహిళను గర్భవతిని చేస్తే లక్షల్లో సొమ్ము వస్తుందని ఆశపెట్టి కొత్త రకం దందాకు తెరతీసినట్టు పోలీసులు గుర్తించారు. బిహార్‌లోని నవాడాలో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గర్భం దాల్చలేని స్త్రీలను గర్భవతిని చేస్తే రూ. 13 లక్షలు ఇస్తామని ఓ వ్యక్తికి ఆఫర్ చేశారు. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ పేరుతో వీరు ఈ రాకెట్‌ను నడిపుతున్నారని పోలీసులు తెలిపారు.
నిందితులు వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా సంప్రదిస్తారని, వారి ‘సేవ’కు బదులుగా లక్షలు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తామని నమ్మబలుకుతారని పోలీసులు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు రూ.799 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి పేరు నమోదుచేసుకోమని చెబుతారని అన్నారు. ఆ తర్వాత ముఠా వారికి కొన్ని ఫోటోలను చూపించి, గర్భం ధరించాలనుకునే వారికి నచ్చిన మహిళను ఎంపిక చేసుకోమని కోరతారని పేర్కొన్నారు. ఎంపిక చేసుకున్న మహిళ అందాన్ని బట్టి రూ. 5 నుంచి 20,000 వరకు మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
‘ఎంపిక చేసుకున్న మహిళ అతడి వల్ల గర్భం దాల్చినట్లయితే రూ.13 లక్షలు ఇస్తానని చెప్పారు... ఒకవేళ ఈ పనిలో విఫలమైనప్పటికీ రూ. 5 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు’ అని నవాడా ఎస్పీ కళ్యాణ్ ఆనంద్ తెలిపారు. నవాడాలో బిహార్ పోలీసుల సిట్ సోదాల అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు. ఘటనా స్థలిలో మొబైల్ ఫోన్లు, ప్రింటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ రాకెట్ వెనుక ప్రధాన సూత్రధారి సహా మిగతా కేటుగాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా సైబర్ మోసాగాళ్ల సిండికేట్‌లో భాగమని కళ్యాణ్ ఆనంద్ అన్నారు.