కేశినేని నాని, కృష్ణ ప్రసాద్‌పై తెలుగుదేశం సినీయర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన ఇబ్రహీంపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్ విమానం విశాఖ వెళ్లిపోతే ఈ కేశినేని నాని మూసుకుని కూర్చున్నారని.. ‘నేను విజయవాడను ఉడదీసా, ఇరగదీసా’ అంటారని ఎద్దేవా చేశారు. ఎంపీ బీఫారం టికెట్ కోసం కేశినేని నాని అమరావతిపై విషం చిమ్ముతున్నారని.. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్‌లపై విషం చిమ్ముతున్నారని, ఆరుగురు ఎమ్మెల్యేలను బొందపెట్టి వైసీపీ నేతలతో చేతులు కలుపుకుని తిరుగుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మైలవరంలో వీరప్పన్ (వసంత కృష్ణ ప్రసాద్)తో చెట్టాపట్టాలేసుకొని శంకుస్థాపనలు ప్రారంభత్సవాలు చేసారని దేవినేని ఉమ ఆరోపించారు. కొండపల్లి మున్సిపాలిటీ ఫలితాలు వచ్చినప్పుడు కుర్చీలు కౌన్సిలర్ల మీద ఎగిరి పడుతుంటే చెరో పక్క చిద్విలాసంగా ఎంపీ, ఎమ్మెల్యే కూర్చున్నారని.. దీన్ని ఏమంటారు? రాజకీయ వ్యభిచారం కాదా? అని ప్రశ్నించారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో కృష్ణ ప్రసాద్, కేశినేని నాని చేసిన అవినీతి రాజకీయాలను టీడీపీ అధికారంలోకి రాగానే కొండపల్లి ఎన్టీఆర్ బొమ్మ దగ్గర అధికారులతో ప్రజా కోర్టులో వాస్తవాలు చెప్పిస్తామన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని దేవినేని ఉమ స్పష్టం చేశారు.