ఏపీ ఫైబర్ నెట్ కేసులో చివరి నమిషంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ చివరి నిమిషంలో వాయిదా పడింది.తమ ఇద్దరి బెంచ్ ఈరోజు కూర్చోవడం లేదని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టం చేశారు. దీంతో విచారణను వాయిదా వేస్తున్నామని, తదుపరి విచారణ తేదీని త్వరలో ప్రకటిస్తామని జస్టిస్ అనిరుద్ధ బోస్ వెల్లడించారు. కాగా, చంద్రబాబు తరపున వాదించడానికి సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా సుప్రీంకోర్టుకు వచ్చారు. అటు ఏపీ ప్రభుత్వం తరపున ఏఓఆర్ హాజరయ్యారు.ఫైబర్ నెట్ స్కామ్ లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం (జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది) విచారించాల్సి ఉంది. ఈ కేసులో ఎలాంటి తీర్పు రానుంది? చంద్రబాబుకి బెయిల్ లభిస్తుందా? లేదా? అనేది ఉత్కంఠకు దారితీసింది. అయితే, చివరి నిమిషంలో విచారణ వాయిదా పడింది.ద్విసభ్య ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది అందుబాటులో లేరు. దీంతో విచారణను వాయిదా వేస్తున్నామని, తదుపరి విచారణ తేదీని త్వరలో ప్రకటిస్తామని మరో జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ వెల్లడించారు.