ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని.. భారత్‌పై అసత్య ఆరోపణలు చేసిన జస్టిన్ ట్రూడో.. ఆ తర్వాత తీవ్ర విమర్శలు, వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే భారత్, కెనడా మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. దీంతో కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న వేళ.. భారతీయ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను ఆ దేశం భారీగా తగ్గించింది. దీంతో 2023 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 14,910 పర్మిట్లను మాత్రమే జారీ చేసింది. అంతకుముందు త్రైమాసికంలో అంటే జులై నుంచి సెప్టెంబర్ మధ్య 3 నెలల వ్యవధిలో భారతీయులకు కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్ల సంఖ్య 1,08,940 గా ఉంది. అంటే గత త్రైమాసికంలో ఈ స్టడీ పర్మిట్ల సంఖ్య దాదాపు 86 శాతం తగ్గుదల నమోదైంది.
భారత్ కెనడా దౌత్య వివాదం కారణంగా భారత్‌లోని రాయబారులను తగ్గించుకుని వెనక్కి రప్పించుకోవాలని కేంద్రం ఆ దేశానికి సూచించింది. దీంతో భారత్ విధించిన గడువు కంటే ముందే 41 మంది దౌత్యాధికారులను కెనడా వెనక్కి తీసుకుంది. అయితే భారత్‌లో దౌత్య అధికారులు భారీగా తగ్గిపోవడంతో ఎక్కువ స్టడీ పర్మిట్లను పరిశీలించడం కుదరడం లేదని కెనడా ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ పరిస్థితిలో ఇప్పుడే ఎలాంటి మార్పు కనిపించే అవకాశాలు లేవని పేర్కొన్నారు. అంటే భవిష్యత్‌లో కూడా కెనడాకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపించడం లేదు.
కెనడాలో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికంగా ఉంటారు. 2022 లో అన్ని దేశాలకు కలిపి కెనడా 2,25,835 స్టడీ పర్మిట్లు జారీ చేయగా.. అందులో 41 శాతం స్టడీ పర్మిట్లను భారతీయ విద్యార్థులే దక్కించుకున్నారు. మరోవైపు.. కెనడాలోని యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థులే ప్రధాన ఆదాయ వనరు కాగా.. అందులో భారతీయులే అధికంగా ఉంటారు. మరోవైపు విదేశీ విద్యార్థుల వలసలు గణనీయంగా పెరిగాయని.. దీంతో కెనడాలో నిరుద్యోగం, ఇళ్ల కొరత సమస్యలు తలెత్తుతున్నాయని ఇటీవల మార్క్ మిల్లర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే తమ దేశంలో నివసిస్తున్న విదేశీ విద్యార్థులపై పరిమితి విధించే యోచనలో ఉన్నామని కూడా చెప్పారు.