ఈ నెల 22 వ తేదీన అయోధ్యలో నిర్వహించ తలపెట్టిన రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిలిపివేయాలని.. అలహాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన భోలా దాస్ అనే వ్యక్తి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. శంకరాచార్యులు లేవనెత్తిన అభ్యంతరాలను తన పిల్‌లో పేర్కొన్న భోలా దాస్.. అయోధ్య ప్రాణప్రతిష్ఠను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరాన్ని జనవరి 22 వ తేదీన ప్రారంభించనున్నారని.. అయితే హిందూ ఆచారాలు, సనాతన సంప్రదాయం ప్రకారం పుష్య మాసంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. పుష్య మాసంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేపట్టకూడదని తెలిపారు. దీంతోపాటు ప్రస్తుతం అయోధ్య రామ మందిర నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని.. ఆలయం ఇప్పటికీ అసంపూర్తిగా ఉందని పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ఏ దేవుడినీ ప్రతిష్టించకూడదని భోలా దాస్ తన పిటిషన్‌లో తెలిపారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సనాతన సంప్రదాయానికి విరుద్ధంగా జరుగుతోందని చెప్పారు.
అంతే కాకుండా అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ వాడుకుంటోందని పిటిషనర్ ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను అర్ధాంతరంగా నిర్వహిస్తోందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే ఇప్పటికే పలువురు అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన శంకరాచార్యులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోమని.. నలుగురు శంకరాచార్యులు స్పష్టం చేశారు. దేశంలోని ప్రముఖ శంకరాచార్యులు అయిన ఉత్తరాఖండ్ జ్యోతిష్య పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి.. పూరీ గోవర్ధన్ పీఠం శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి, శృంగేరి పీఠాధిపతి స్వామి భారతీ కృష్ణాజీ, ద్వారకా పీఠాదిపతి స్వామి సదానంద్ మహారాజ్ ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ సహా ఇండియా కూటమిలోని పలు పార్టీలు ఇప్పటికే ఈ అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన ఆహ్వానాలను తిరస్కరించాయి. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బీజేపీ, నరేంద్ర మోదీ.. తమ వ్యక్తిగత కార్యక్రమంగా భావిస్తున్నాయని ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే హడావుడిగా నిర్మాణంలో ఉన్న అయోధ్య రామాలయాన్ని ప్రారంభిస్తున్నారని విమర్శలు గుప్పించాయి.