కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాలని కోరారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని జనసేనాని నివాసానికి వెళ్లిన షర్మిల.. ఆయనకు వెడ్డింగ్ ఇన్విటేషన్ అందజేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డి, ప్రియా అట్లూరి గురించి వివరాలు అడిగి తెలుసుకున్న పవన్.. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా నియమితురాలైన షర్మిలకు బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు.
జనవరి 18న రాజారెడ్డి, ప్రియా అట్లూరి ఎంగేజ్‌మెంట్ జరగనుంది. ఫిబ్రవరి 17న వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగనుంది. అనంతరం జరగనున్న వెడ్డింగ్ రిసెప్షన్ కోసం షర్మిల రాజకీయ ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు శుభలేఖ అందించిన షర్మిల.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులకు ఇన్విటేషన్ అందించారు. చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన సమయంలో ఆమె పచ్చ రంగు చీరలో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
పీసీసీ అధ్యక్షురాలిగా నియమితురాలైన షర్మిల.. తన కొడుకు ఎంగేజ్‌మెంట్ తర్వాత పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పీసీసీ చీఫ్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తండ్రీ కూతుళ్లిద్దరూ పీసీసీ చీఫ్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి కావడం విశేషం. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇతర పార్టీల్లో, ముఖ్యంగా వైఎస్సార్సీపీలో టికెట్లు దక్కని నేతలు హస్తం గూటికి చేరే అవకాశం ఉంది.