స్వాతంత్రోద్యమంలో ఎన్నో చారిత్రక సమావేశాలకు వేదికగా నిలిచిన బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిస్తున్న భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం పనులు పూర్తిచేసుకుని ప్రారంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చరిత్రలో నిలిచిపోయేలా రూపుదిద్దుకున్న సామాజిక న్యాయ మహాశిల్పం జాతికి అంకితమిచ్చే తరుణం వచ్చేసింది. అద్భుతమైన ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ స్మృతివనం పనులను మహాయజ్ఞంలా పూర్తిచేశారు. అత్యంత అందంగా తీర్చిదిద్దుతున్న ఈ ప్రాంగణం ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించే వేదికగా మారనుంది. దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో ఇదే అతిపెద్దది కావడం విశేషం. 206 (81 అడుగుల బేస్, 125 అడుగుల విగ్రహం) అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాత్రివేళ ప్రత్యేక కాంతులతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి, అత్యంత అద్భుతంగా రూపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిత్యం అధికారులతో మాట్లాడుతూ పనులు పరుగులు పెట్టించారు. ఇలా స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయ మహా శిల్పం)ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఈ అరుదైన అంబేడ్కర్ సామాజిక న్యాయ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 19న ఆవిష్కరిస్తున్నారు. ఇక స్మృతివనాన్ని వీక్షించేందుకు ఈ నెల 20 నుంచి సామాన్య ప్రజలకు ప్రవేశం కల్పించనున్నారు.