రాష్ట్రవ్యాప్తంగా కులగణన ప్రక్రియ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా.. శుక్రవారం తొలిరోజు 14,334 సచివాలయాల్లో కులగణన ప్రక్రియ మొదలైంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు ఉమ్మడిగా సచివాలయాల పరిధిలో ఇంటింటీకి వెళ్లి కులాలవారీగా ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తున్నారు. పది రోజుల పాటు ఈ ప్రక్రియ చేపడతారు. ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్ విధానంలో చేపట్టేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం రాష్ట్రమంతటా ఒకేసారి కులగణన ప్రారంభం కాగా.. మొబైల్ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో చాలా చోట్ల వివరాల నమోదులో ఆటంకాలు ఏర్పడినట్టు అధికారులు వెల్లడించారు. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 5,34,160 కుటుంబాలకు సంబంధించి 10,22,764 మంది సభ్యుల వివరాల నమోదు పూర్తి చేసినట్టు అధికారులు వెల్లడించారు. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో నెట్, సెల్ సిగ్నల్ ఉండని దాదాపు 515 గ్రామ సచివాలయాల పరిధిలో ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ విధానంలో కులగణన చేపట్టారు.