కృష్ణపట్నం కంటైనర్ టెర్మినాల్ మూతపడిపోనుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి వచ్చే వెయ్యి కోట్ల ఆదాయం నిలిచిపోనుందని అన్నారు. కృష్ణపట్నం పోర్టు రావడానికి చంద్రబాబు ముఖ్య కారణమన్నారు. కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ మూతపడితే దాదాపు పది వేలమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోనున్నారన్నారు. ఇంత పెద్ద పోర్ట్ తరలిపోతుంటే రివ్యూ చేయించే ఆలోచన సీఎంకి లేదా? మంత్రికి, ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇంత జరుగతుందా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కన్నెర్ర చేస్తే వెళ్తున్నారో? మంత్రి ఆరాచకం వలన వెళ్తున్నారో? అర్ధం కావడం లేదన్నారు. చెన్నై, ముంబై, విశాఖ తరువాత ఆ స్థాయి పోర్ట్ తరలిపోతోందని.. పోర్ట్ ఆధారిత పరిశ్రమలు ఇక మూత పడుతాయన్నారు. కృష్ణపట్నం పోర్ట్ తరలిపోవడం వలన కొన్ని పరిశ్రమలకు ట్రాన్స్‌పోర్ట్ అధిక భారం అవుతుందన్నారు. ఆరు వేల ఎకరాలు ఎస్ఈజడ్ విలువైన భూములు నిర్వీర్యం అవుతాయన్నారు. ప్రజల దగ్గర తీసుకున్న విలువైన భూములు వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఇంత వరకు ఆపేందుకు ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. ఐదు రోజుల్లో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఒకప్రక్క విశాఖ ఉక్కు, మరోప్రక్క కృష్ణపట్నం పోర్టు కనుమరుగు కావడం రాష్ట్రానికి తీరని నష్టమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.