రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును పక్కకు తీయమన్నందుకు.. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఆ వాహనం డ్రైవర్, అతడి అనుచరులు రెచ్చిపోయారు. విచక్షణారహితంగా దాడికి దిగి అనుచితంగా ప్రవర్తించారు. దుండగుల దాడిలో ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. దారుణమైన ఈ ఘటన కడప జిల్లా రాయచోటి శివారులో శనివారం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన అమరావతి సర్వీసు బస్సు కడప నుంచి బెంగళూరుకు వెళ్తోంది. బస్సు రాయచోట పట్టణ శివారుకు చేరుకోనేసరికి ఓ కారు రోడ్డుకు అడ్డంగా నిలిచి ఉండటాన్ని డ్రైవర్ గుర్తించాడు.
దీంతో బస్సును ఆపిన డ్రైవర్.. అడ్డంగా ఉన్న కారును తీయాలని కోరారు. ఈ విషయంపై మాటా మాటా పెరిగి ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసింది. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన కారు డ్రైవర్, అతడి అనుచరులు దాడికి తెగబడ్డారు. వారంతా కలిసి ఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదారు. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు బస్సులోని మరో అటెండర్‌కు గాయాలయ్యాయి. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన ఆర్టీసీ డ్రైవర్, అటెండర్‌ను చికిత్స కోసం స్థానికులు రాయచోటి ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు ఆధారంగా దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
కాగా, గతంలోనూ ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనలు కడప జిల్లాలో చోటుచేసుకున్నాయి. గత ఏడాది నవంబరులో ఆర్టీసీ డ్రైవర్‌పై ప్రభుత్వ ఉపాధ్యాయుడి దాడి చేశాడు. బస్సు నిలపలేదని కోపంతో రెచ్చిపోయాడు. రాయచోటి-వేంపల్లె మెయిన్ రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. నాగలగుట్టపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద రాయచోటి నుంచి వేంపల్లె వెళ్తున్న బస్సును నిలపాలని ఉపాధ్యాయుడు రామ్మోహన్ కోరాడు. డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లడంతో బైక్‌పై వెంబడించి.. బస్సు ఎందుకు ఆపలేదని కండక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో డ్రైవర్ నరసింహులు జోక్యం చేసుకుని రద్దీ కారణంగా బస్సు ఆపలేదని సమాధానమిచ్చాడు. దీంతో ఆగ్రహించి ఉపాధ్యాయుడు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు.